పోయిరా బతుకమ్మా..!

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక..మహిళల అభ్యున్నతి కోసం చేసే పండుగ..పూలను, ప్రకృతిని పూజించే బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు తెలంగాణ అక్కాచెల్లెమ్మలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో శ్రీకారం చుట్టి..సద్దుల బతుకమ్మతో..బతుకమ్మకు వీడ్కోలు పలికే సంబరానికి సమయం ఆసన్నమైంది. ఇవాళ సాయంత్రం జరగనున్న సద్దుల బతుకమ్మ నగరం ముస్తాబైంది. ఈ వేడుకల కోసం ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న బతుకమ్మ ఘాట్ అంగరంగ వైభవంగా ముస్తాబు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎల్బీ స్టేడియం నుంచి సాయంత్రం ఐదు గంటలకు బతుకమ్మ శోభాయాత్ర ప్రారంభమై ఆరున్నర ప్రాంతంలో ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది.

 

వేడుకలు ఎలా జరుగుతాయంటే: సద్దలు బతుకమ్మనే పెద్ద బతుకమ్మ అని పిలుస్తారు. అసలు బతుకమ్మ వైభవాన్ని చూడాలంటే సద్దుల బతుకమ్మ రోజే చూడాలి. తీరొక్కపూలతో పేర్చే బతుకమ్మలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తంగేడు, గానుగ, బంతి పూలను పేర్చి తీర్చిదిద్దిన బతుకమ్మను ముగ్గుపెట్టి, పీట వేసి దానిపై పెడతారు. పులుసు కలిపిన సద్ది, పెరుగు కలిపిన సద్దితో పాటు పెసర, కొబ్బరి, పుట్నాలు, నువ్వులు, పల్లీలు, బియ్యం పొడులు కలిపి తయారు చేసిన తొమ్మిది రకాల సద్దులు బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు.

 

కొత్త చీరలు కట్టుకున్న ఆడపడుచులు సోపతోళ్లతో కలిసి సాయంత్రానికి చెరువు గట్టుకు చేరుకొని..బృందాలుగా వీడిపోయి..మధ్యలో బతుకమ్మలను పెట్టి దాని చుట్టూ వలయాకారంలో లయబద్ధంగా పోయిరా బతుకమ్మా..పోయిరావమ్మా.మల్లొచ్చె ఏడాది తిరిగి రావమ్మా.. అంటూ చప్పట్లు కొడుతూ ఆడి పాడతారు. అనంతరం తమ వెంట తెచ్చిన సద్దులను అందరికీ పంచుతారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకొని తమ ఐదవతనం కలకాలం నిలపాలని బతుకమ్మను కోరుకుంటారు.

 

ఎనిమిదవ రోజు బతుకమ్మ వేడుకల హైలెట్స్: తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న బతుకమ్మ వేడుకలు ఎనిమిదవ రోజు ఘనంగా జరిగాయి. రవీంద్రభారతి ప్రధాన వేదికలో బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ జాతీయ సాంస్కృతికోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు.