చెట్టు కోసం న్యాయపోరాటం..

దేశంలో తమిళనాడు వాసులది ఒక వైవిధ్యమైన తీరు. అక్కడి వారు ఎవరినైనా అభిమానిస్తే చచ్చేంత వరకు గుండెల్లో నిలుపుకుంటారు. అంతేకాకుండా గుడికట్టి మరి పూజిస్తారు. మనుషుల్నే కాదు చెట్టు, పుట్టను కూడా వీరు అభిమానిస్తారు అనడానికి తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనే నిదర్శనం. చెన్నైకి సమీపంలోని పెరుంగుడిలో వందేళ్ల మర్రిచెట్టు ఒకటి ఇటీవల ఉన్నట్లుండి ఎండిపోసాగింది.

 

ఏడాది క్రితం వరకు ఎంతో పచ్చగా, ఆరోగ్యంగా ఉన్న చెట్టు ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. దాని ఊడలు ఒక్కొక్కటిగా ఎండిపోసాగాయి. మనమైతే చెట్టు వయసైపోయిందని అందుకే ఎండిపోతుందని వదిలివేసేవాళ్లం..కాని ఆ చెట్టుతో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉన్న చుట్టుపక్కలవారు మాత్రం అలా భావించేలేదు. ఆ చెట్టు సరిగ్గా ఓ ఐటీ కంపెనీకి సమీపంలో ఉండటంతో..దాని అడ్డు తొలగించుకోవాలనే దురుద్దేశంతో వారే దానిపై విషప్రయోగం చేసి చంపారని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. దీనిపై హార్టికల్చర్ నిపుణులు సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.