ప్రేమించలేదని నడిరోడ్డుపై యువతి మెడ నరికేసిన కిరాతకుడు..!

posted on: Jul 17, 2026 3:53PM

 

కర్ణాటకలో సభ్యసమాజం తలదించుకునే అత్యంత ఘోరమైన సంఘటన ఒకటి వెలుగుచూసింది. ప్రేమ పేరుతో పిచ్చిపట్టిన ఒక ప్రేమోన్మాది, తన ప్రేమను నిరాకరించిందన్న ఒకే ఒక్క కారణంతో ఓ అమాయక యువతిని పట్టపగలు, అందరూ చూస్తుండగానే వేటకొడవలితో నరికి చంపాడు. దక్షిణ కన్నడ జిల్లాలోని బంత్వాల్ సమీపంలో గల కల్లాడ్క ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం 22 ఏళ్ల వయసున్న చేతన్ అనే యువకుడు చేసిన ఈ ఘాతుకానికి 21 ఏళ్ల యువ నర్సు లావణ్య బలైపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు లావణ్య స్థానికంగా ఒక ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది.

 నిందితుడు చేతన్ గత కొంతకాలంగా ఆమెను ప్రేమించాలంటూ తీవ్రంగా వేధిస్తున్నాడు. నిత్యం ఆమె వెంటే తిరుగుతూ మానసిక క్షోభకు గురిచేసేవాడు. అయితే, లావణ్య అతడి ప్రవర్తన నచ్చక, ఆ ప్రతిపాదనను ఖరాఖండిగా తిరస్కరించింది. ఈ క్రమంలో తన ప్రేమను అంగీకరించడం లేదన్న కోపంతో, ఎలాగైనా ఆమెను హతమార్చాలని చేతన్ పథకం వేశాడు. ఆ దారుణమైన రోజున లావణ్య తన నర్సింగ్ డ్యూటీ ముగించుకుని, ఇంటికి వెళ్లడం కోసం బస్సు ఎక్కింది. అదే సమయంలో పొంచి ఉన్న నిందితుడు చేతన్ కూడా అదే బస్సులోకి ప్రవేశించాడు. బస్సులో అతడిని గమనించిన లావణ్య తీవ్ర భయాందోళనకు గురైంది. ప్రమాదాన్ని ముందే ఊహించిన ఆమె, బస్సు కదిలేలోపే వెంటనే కిందకు దిగి ప్రాణాలు కాపాడుకోవడానికి బస్టాండ్‌ వైపు వేగంగా పరుగులు తీసింది. 

అయినా వదల్లేదు ఆ కిరాతకుడు. వేటకొడవలి పట్టుకుని ఆమె వెంటే పరిగెత్తాడు. బస్టాండ్ ఆవరణలోనే జనసమ్మర్థం ఎక్కువగా ఉన్నప్పటికీ, చేతన్ లావణ్యను వెంటాడి పట్టుకున్నాడు. ఏమాత్రం మానవత్వం లేకుండా తన చేతిలోని పదునైన వేటకత్తితో ఒక్కసారిగా లావణ్య మెడపై దాడి చేశాడు. బలమైన ఆ దెబ్బకు లావణ్య రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అయినా ఆ ఉన్మాది క్రూరత్వం చల్లారలేదు. కిందపడి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న ఆ యువతి మెడపై మరో మూడు నుండి నాలుగు సార్లు నరికాడు. 

ఈ ఘోరమైన దాడికి ఆ యువతి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. పట్టపగలు నడి బస్టాండ్‌లో అందరూ చూస్తుండగానే ఈ ఘోరం జరిగిపోయింది. ఘాతుకానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు చేతన్ అక్కడి నుండి పారిపోయాడు. ఈ పాశవిక సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న బంత్వాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. ఈ దారుణంపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Bantwal murder case, Karnataka crime news, one sided love attack, nurse Lavanya killed, psycho lover Chethan, Dakshina Kannada crime updates


 

google-ad-img
    Related Sigment News
    • Loading...