TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బాన్సువాడ గురుకుల పాఠశాలలో విషాదం

Published on: Mon Jan 26, 2026 3:07PM

 

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం ఎస్సీ గురుకుల హాస్టల్‌లో చోటు చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థిని సంగీత  ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. హాస్టల్ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ సునీత తన ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ కోసం గురుకుల పాఠశాల ఫర్నిచర్‌ను ఆటోలో తరలించించినట్టు సమాచారం. ఈ పనిలో భాగంగా సుమారు 30 కుర్చీలు ఆటోలో తీసుకెళ్లి అన్‌లోడ్ చేసిన అనంతరం, అదే ఆటోలో నలుగురు విద్యార్థినులు తిరిగి హాస్టల్‌కు బయలుదేరారు.

ఆటో డ్రైవర్ రాష్‌గా వాహనం నడుపుతుండగా, డ్రైవర్ గమనించకుండా అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు కిందికి దూకినట్టు పోలీసులు తెలిపారు. చివరగా దూకిన సంగీత తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై సంగీత తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఇంచార్జ్ ప్రిన్సిపాల్ సునీత నిర్లక్ష్యం వల్లే మా కూతురు ప్రాణాలు కోల్పోయింది” అంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. గురుకుల పాఠశాలలో జరిగిన ఈ విషాదకర ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు  సంగీత మృతి పట్ల ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ. 5లక్షల ఎక్స్‌గ్రేసియా ప్రకటించిందని తెలిపారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని పోచారం భరోసా ఇచ్చారు.