TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ్యాంకు అధికారుల నిర్వాకం. సోదరి అస్తిపంజరంతో నడిచి వచ్చిన నిరుపేద

Published on: Tue Apr 28, 2026 12:57PM

బ్యాంకింగ్ నిబంధనలు ప్రజలకు సాయపడాలి కానీ, వారిని క్షోభకు గురిచేయకూడదు. కానీ ఒడిశాలో ఓ బ్యాంకు అధికారుల మొండితనం ఒక వ్యక్తిని తన సోదరి సమాధిని తవ్వి ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకు గడపకు తీసుకువచ్చేలా చేసింది.  అసలేం జరిగిందంటే.. ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై  వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు. అయితే అందుకు అధికారులు అంగీకరించలేదు. బ్యాంకులో సొమ్ము విత్ డ్రా చేయాలంటే.. ఖాతాదారుడు స్వయంగా వచ్చి తీరాలన్నారు. అలా రాలేని పక్షంలో సంతకం, లేదా వేలిముద్రకావాలని చెప్పారు.

 తన సోదరి చనిపోయిందని, ఆమె రాలేదని  ఆ వ్యక్తి బ్యాంకు అధికారుల కాళ్లావేళ్లా పడినా ఫలితం లేకపోయింది. డెత్ సర్టిఫికేట్ ఉందని చెప్పినా బ్యాంకు అధికారులు వినకపోవడంతో..  తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకుని అమలు చేశాడు. బ్యాంకు నుంచి నేరుగా తన సోదరిని పూడ్చిపెట్టిన సమాధి వద్దకు వెళ్లాడు. ఆమె సమాధిని తవ్వి ఆమె అవశేషాలను (అస్తిపంజరం) వెలికి తీసి..మోసుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు వచ్చాడు. బ్యాంకు అధికారులకు తన సోదరి అస్తిపంజరాన్ని చూపుతూ.. ఆమె వచ్చింది.. ఇప్పుడు డబ్బులు ఇవ్వండంటూ డిమాండ్ చేశాడు.   ఈ సంఘటన అందరి చేతా కన్నీళ్లు పెట్టించింది. 

వివరాలిలా ఉన్నాయి.. కియోన్‌ఝర్‌ జిల్లాలోని దియానాలి గ్రామానికి చెందిన గిరిజనుడు జితు ముండా సోదరి కక్రా ముండా రెండు నెలల క్రితం మరణించింది. ఆమె భర్త, ఏకైక సంతానం కూడా ముందే చనిపోవడంతో జితు ఒక్కడే ఆమెకు దగ్గరి బంధువుగా మిగిలాడు. కక్రా పేరు మీద మల్లీపసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండగా, అందులో రూ.19,300 ఉన్నాయి. ఆ సొమ్ము తీసుకునేందుకు జితు ముండా బ్యాంకుకు వస్తే.. అధికారులు  నిబంధనల ప్రకారం అడ్డు చెప్పారు. ఈ ఘటనపై నెటిజనులు బ్యాంకు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలకే విలువఇస్తూ మానవత్వాన్ని మరిచారని దుమ్మెత్తి పోస్తున్నారు.