TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యెడ్డి 'ఆశ'లపై నీళ్ళు

Published on: Sat Feb 25, 2012 9:10AM

బెంగళూరు: కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్ప మళ్లీ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవాలని చేస్తున్న యత్నాలకు గండిపడి భంగపాటు మిగిలింది. అధికారంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి డివి సదానందగౌడను తొలగించే ప్రసక్తిలేదని అధిష్ఠానం స్పష్టం చేసింది. మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పపై వచ్చిన అవినీతి ఆరోపణలు తొలగిపోయే వరకు వేచి ఉండాల్సిందేనని తెలియచేసింది. నగర శివారులలోని ఒక రిసార్ట్‌లో పార్టీ శాసనసభ్యులు, ఎంపీల ‘చింతన్ మంతన్’ సమావేశానికి ముందు యెడ్యూరప్ప బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కారీని కలిసి తనకు మళ్లీ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చేదీ లేనిదీ ఈ నెల 27లోగా తేల్చాలని కోరుతూ అల్టిమేటం ఇచ్చినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ‘ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి సదానందగౌడ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన నాయకత్వాన్ని మార్చే అవసరం లేదు’ అని యెడ్యూరప్ప తనను కలిసిన మర్నాడే గడ్కారీ తెగేసి చెప్పారు. గనుల తవ్వకాలలో జరిగిన అక్రమాలలో ముఖ్యమంత్రి యెడ్యూరప్పకు కూడా ప్రమేయం ఉందని కర్నాటక లోకాయుక్త తన నివేదికలో పేర్కొనడంతో పార్టీ అధిష్ఠానం ఆయనను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరింది. దీనిపై అసంతృప్తితో ఉన్న యెడ్యూరప్ప మళ్లీ ముఖ్యమంత్రి పదవిపై కన్నేసి అక్కడ ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడగట్టుకుని తన బలాన్ని అధిష్ఠానం వద్ద చాటేందుకు ఇటీవల ప్రయత్నాలు చేశారు. ‘లోకాయుక్త నివేదిక యెడ్యూరప్పకు అన్యాయం చేసింది. దీనిపై ఆయన కోర్టులో సవాలు చేశారు. ఆయనకు త్వరలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. న్యాయస్థానం ఆయన నిజాయితీపరుడిని తేల్చిన తర్వాత తప్పనిసరిగా పార్టీ ఆయనను తగినవిధంగా గౌరవిస్తుంది’ అని గడ్కారీ వెల్లడించారు. దీంతో యెడ్యూరప్పకు భంగపాటు కలిగినట్లే అయింది.