జగన్ నిద్రలేవాలి.. బాబు నిద్రపోవాలి

 

తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరి హడావుడి చేసిన ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్.. తరువాత కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి సైలెంట్ అయ్యారు. అయితే చాలా రోజుల తర్వాత మౌనం వీడిన ఆయన.. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీపై ఆయన విమర్శలు గుప్పించారు. పల్నాటి గొడవలతో ఏపీ పరువు గంగలో కలిసిందని, ఆంధ్రా మరో బీహార్ లా తయారైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వందరోజుల పాలనలో ఏమీ చెయ్యని సీఎం జగన్ నిద్రలేవాలని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలను అటకెక్కించారని విమర్శించారు. ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని.. జెండా, అజెండా లేని నాయకులు కొంత కాలం రెస్ట్ తీసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. ఇప్పట్లో ఎన్నికలు లేవని తెలుసుకోవాలని, కలిసి పనిచేస్తే రాష్ట్రానికి మంచిదని అధికార, ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. జనాన్ని కాసేపు మనశాంతిగా ఉండనివ్వండి. మీ కన్ఫ్యూషన్‌లో జనం ఏమి చెయ్యాలో, ఎక్కడ ఉండాలో, అమరావతి ఉంటుందో ఊడుతుందో తెలియక జుట్టు పీక్కుంటున్నారని మండిపడ్డారు. 'దగా పడ్డ తెలుగు ప్రజలారా మీరు ఏ నాయకుణ్ణి నమ్మొద్దు. మీకు సహాయం చేసే స్థితిలో నేను లేను. మనందరినీ ఆ భగవంతుడే కాపాడాలి. భావితరాలకు ఆయనే దిక్కు.' అని బండ్ల వ్యాఖ్యానించారు.