TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బండి యాత్ర మొదలు

Published on: Tue Aug 2, 2022 10:54AM

ఇప్పటికే రెండు విడతల్లో రాష్ట్రంలో ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మూడో విడత ప్రజా సంగ్రామ పాద యాత్ర మంగళవారం (ఆగస్టు 2) ప్రారంభించారు.   యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం నుంచి మొదలైన సంజయ్ పాదయాత్ర 24 రోజుల పాటు, సాగనుంది. ఐదు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 328 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. కాగా బండి సంజయ్   (మంగళవారం) యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించి, వంగపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

ఈ సభకు కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్‌, కిషన్‌ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరావుతారు.  యాదాద్రిలో ప్రారంభమై వరంగల్‌లోని భద్రకాళి ఆలయం వరకు మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. ఈసారి చారిత్రక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. ప్రజల సంస్యలు  వినడం, ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేననే సంకేతాలు పంపడమే యాత్ర లక్ష్యంగా బండి సంజయ్ పాద యాత్ర  సాగుతుందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.  మరోవైపు ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో శ్రేణులు నిమగ్నమయ్యాయి.

ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం 24 రోజులపాటు సాగనుంది.యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల మీదుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వెళ్లనున్నారు. ఐదు జిల్లాల్లోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, జనగాం, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. ఈ నెల 26న భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. యాత్ర ముగింపు సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

మరోవంక ఈరోజు ( ఆగష్టు 2) సిరిసిల్లలో జరగవలసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిరిసిల్ల పర్యటన వాయిదా పడిన విషయం తెలిందే. వరంగల్ ‘లో రైతు గర్జన సభ సక్సెస్ అయిన నేపధ్యంలో ఆగస్టు 2న సిరిసిల్లలో నిరుద్యోగ గర్జన సభ చేపట్టాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. ఈమేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జులై మొదటి వారంలో ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కోసం చేపట్టబోతున్న కార్యాచరణ ను డిక్లరేషన్‌ రూపంలో రాహుల్‌గాంధీ ప్రకటిస్తారని తెలిపారు. 

అయితే తాజాగా ఈ సభను వాయిదా వేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈడీ విచారణ, పార్లమెంట్ సమావేశాలు, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు హాజరైన సమావేశంలో సిరిసిల్లలో రాహుల్ సభను వాయిదా వేయాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. సిరిసిల్లలో రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి కొత్త తేదీలను కాంగ్రెస్ పార్టీ త్వరలో వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.