కరీంనగర్ జైలుకు బండి సంజయ్.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ
Published on: Mon Jan 3, 2022 2:22PM
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది జిల్లా జిల్లా సెషన్స్ కోర్టు. సంజయ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారించిన కోర్టు.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. సంజయ్ కు ఈనెల 17 వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు మెజిస్ట్రేట్. బండి సంజయ్ సహా మరో ఐదుగిరికి రిమాండ్ విధించింది కరీంనగర్ న్యాయ స్థానం. దీంతో సంజయ్ కు కరీంనగర్ జైలుకు తరలించారు పోలీసులు.
బండి సంజయ్‌పై కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంపై బండి సంజయ్ సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం సర్కారు జారీ చేసిన జీవో 317ను సవరించాలనే డిమాండ్‌తో జిల్లాలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి.. అరెస్ట్ చేశారు.
మరోవైపు ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన సంజయ్ చేస్తున్న పోరాటం భేష్ అని మెచ్చుకున్నారు. కేసుల గురించి భయపడాల్సి అవసరం లేదన్నారు. బండి వెనక జాతీయ నాయకత్వం ఉందని.. ఇదే విధంగా ప్రజల సమస్యలపై పోరాడాలని.. సంజయ్ జీకి తన మాటగా చెప్పాలని జేపీ నడ్డా ఫోన్‌లో తెలిపారు.


