హామీల ‘బండి’ పరుగులు తీసేనా?

గ్రేటర్‌లో ‘సంజయ్’ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

 

ఇచ్చిన హామీలకు నిధులెలా?

 

ట్రాఫిక్, ఎల్‌ఆర్‌ఎస్‌తో ‘గ్రేటర్’కు సంబంధమేమిటో?

 

తెలంగాణలో బీజేపీ ‘సంజయ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్’.. అధికార టీఆర్‌ఎస్  పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. కేసీఆర్ సర్కారును ఊపిరాడనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంజయ్.. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో,  బస్తీనిద్ర చేసే వరకూ వెళుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక విజయం ఇచ్చిన టానిక్.. అందరికంటే సంజయ్‌కే ఎక్కువ పనిచేస్తున్నట్లు గ్రేటర్‌లో ఆయన దూకుడు చూస్తే స్పష్టమవుతోంది. అందుకే ఎవరూ ఊహించని హామీలు వరదలా పారిస్తూ, అందరినీ తన వైపు మళ్లించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

సహజంగా ఏ ఎన్నికలప్పుడయినా,  మేనిఫెస్టోలు విడుదల చేయడం అన్ని పార్టీలకూ అలవాటే. ప్రధానంగా.. అధికారంలో ఉన్న పార్టీలు,  స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు విడుదల చేసే మేనిఫెస్టోకు ఎక్కువ విలువ-నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఆ పార్టీనే అధికారంలో ఉంటుంది కాబట్టి, అది ఇచ్చే హామీలే ఎక్కువ మేరకు పనిచేసే అవకాశం ఉంటుంది. అదే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎన్ని హామీలిచ్చినా,  వాటిని ప్రజలు నమ్మే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. ప్రభుత్వంలో ఒక పార్టీ ఉంటే, కార్పొరేషన్‌లో మరో పార్టీ అధికారంలోకి వస్తే పనులు జరగవు. పైగా ప్రతిరోజూ ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఈ ఒక్క కారణంతోనే ప్రజలకు.. ప్రభుత్వాలపై వ్యతిరేకత, ప్రతిపక్షాలపై సానుకూలత ఉన్నప్పటికీ, ఓటు మాత్రం అభివృద్ధి కోణంలో, అధికారంలో ఉన్న పార్టీకే వేస్తుంటారు. ఇది ఎక్కడయినా సహజమే.

 

గతంలో చెన్నై నగరంలో ఇదే జరిగింది. అధికారంలో అన్నాడిఎంకె ఉంటే, మేయర్ పదవి డీఎంకె చేతిలో ఉండేది. ఆ సమయంలో జరిగిన ఘర్షణ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఎంసీహెచ్ ఎన్నికలు జరిగితే టీడీపీ మేయర్‌గా తీగల కృష్ణారెడ్డి సారధ్యంలో టీడీపీ అధికారం సాధించింది. అప్పటివరకూ టీడీపీనే ప్రభుత్వంలో ఉన్నందున ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఆ తర్వాత వైఎస్ సీఎంగా రావడంతో, గ్రేటర్ పరుగు మందగించిన వైనాన్ని విస్మరించకూడదు.  పైగా ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న కార్పొరేషన్లు పంపించే ప్రతిపాదనలను, రాష్ట్ర ప్రభుత్వం సహజంగా ఆమోదించదు. బడ్జెట్ లో కూడా వివక్ష ప్రదర్శిస్తుంది. కాబట్టి.. విపక్ష పార్టీలు ఇచ్చే హామీలు చెల్లుబాటయ్యే అవకాశాలు బహు తక్కువగా ఉంటాయి. నేరుగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే వెసులుబాటు కూడా తక్కువగానే ఉంటుంది. ఈ  దృష్ట్యా నిధులు-అధికారాల కోసం నిత్యం అధికారంలో ఉన్న పార్టీతో యుద్ధం చే యడం అనివార్యం.

 

ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో, బీజేపీ దళపతి బండి సంజయ్ ఇచ్చిన హామీలు దుమ్మురేపుతున్నాయి. ఓ వైపు ప్రజలు వాటిపై ఆశ-ఆసక్తి ప్రదర్శిస్తున్నా.. మరోవైపు అది ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్న సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు, కేసీఆర్ సర్కారు ఇంటికి పదివేలు నష్టపరిహాం అందించింది. అయితే, ఆ పంపిణీ ప్రక్రియపై చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, స్థానిక నేతలు తమ వారికి మాత్రమే ఇప్పించుకున్నారని, అందులో సగం కొట్టేశారన్న ఆరోపణలు కాంగ్రెస్-బీజేపీ నుంచి వినిపించిన విషయం తెలిసిందే. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.  వరద నిధుల సాయం ఆపాలని బండి సంజయ్ ఫిర్యాదు చేసినందుకే,  ఎన్నికల కమిషన్ దానిని ఆపివేసిందని టీఆర్‌ఎస్ ఆరోపించటం..  దానిని రుజువుచేయాలని సంజయ్ సవాల్ చేసి, ప్రమాణం చేసేందుకు  భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడం సంచలనం సృష్టించింది.

 

మళ్లీ ఎన్నికల వాతావరణాన్ని కాక పుట్టించేందుకు..  సంజయ్ బీజేపీ పక్షాన ఇచ్చిన హామీలు కూడా, జనక్షేత్రంలో చర్చనీయాంశంగా మారాయి. తాము గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే, వరద బాధితులకు ఇంటికి 25 వేలు ఇస్తామని, వరదలో కారు-మోటర్‌వాహనం పాడయిపోతే కొత్త వాహనాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా... నగరంలో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తూ యువతను వేధిస్తున్నందున, తాము అధికారంలోకి వస్తే.. ఆ చలాన్లు తామే కడతామని, అసలు ట్రాఫిక్ చలాన్ల వ్యవస్థనే రద్దు చేస్తామన్న సంచలన హామీలు,  సహజంగానే టీఆర్‌ఎ స్‌లో కలవరం కలిగిస్తున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ రద్దు హామీ కూడా అందులో ఒకటి. అయితే.. సంజయ్ హామీల సాధ్యాసాధ్యలపైన విద్యాధికులు, మధ్య తరగతి వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది.

 

అసలు..  సంజయ్ ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోనివి అయినప్పుడు, ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో గెలిచే మేయర్ ఎలా అమలుచేస్తారన్న సందేహం తెరపైకి వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ బడ్జెట్ 18 వేల కోట్లు మాత్రమే. అందులో జీతాలకే సింహభాగం ఖర్చవుతుంది. ఇక ఇటీవలి వరద బాధితులకు..  ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాతా నుంచి మాత్రమే,   ఇంటికి పదివేల రూపాయల చొప్పున చేసిన సాయం చేశారు.  దీనికి- గ్రేటర్ కార్పొరేషన్ నిధులకు ఏమాత్రం సంబంధం లేదు. ఇక ఎల్‌ఆర్‌ఎస్ కొనసాగింపు లేదా రద్దు అంశం కూడా,  పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిథిలోనిదే. ఒకవేళ రేపు బీజేపీ మేయర్‌గా గెలిస్తే, ఇంటికి 25 వేలు ఏ ఖాతా నుంచి ఇస్తారన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

 

మరో కీలక అంశం ట్రాఫిక్ చలాన్ల రద్దు. దీనితో గ్రేటర్ కార్పొరేషన్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ చలాన్లు గ్రేటర్ కార్పొరేషన్ చెల్లిస్తే చెల్లించవచ్చు. కానీ అందుకు కోట్ల రూపాయల నిధుల అవసరం ఉంది. ఇప్పటికే గ్రేటర్ కార్పొరేషన్ నిధుల్లేక అవస్థల పాలవుతోంది.  అయితే, మోటార్ వెహికల్ యాక్టు పూర్తిగా కేంద్ర మార్గదర్శకాల మేరకు అమలవుతుంది. చలాన్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెళుతుంది. వాటిని పోలీశాఖ లేదా ప్రభుత్వ అవసరాల మేరకు వినియోగిస్తుంటారు. ఇది ఒక్క తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కాదు, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ అమలయ్యే ప్రక్రియనే.

 

తాజా గ్రేటర్ ఎన్నికల్లో..  తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తూ కడుతున్న ట్రాఫిక్ చలాన్లు.. ఇకపై  గ్రేటర్ కార్పొరేషన్ చెల్లిస్తుందన్న,  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హామీపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 2014 నుంచి 2019 జూన్ వరకూ అందుబాటులో ఉన్న గణాంకాలు పరిశీలిస్తే... మొత్తం 56 కోట్ల రూపాయలు చలాన్ల రూపంలో వసూలయ్యాయి. అందులో సిగ్నల్ జంపింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేయడం, త్రిబుల్‌రైడింగ్ వంటి కేసులకు సంబంధించిన చలాన్లు ఉన్నాయి. కేంద్రప్రభుత్వం కూడా చలాన్ల రుసుం పెంచడం ద్వారా, ప్రమాదాలు తగ్గించేందుకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ర్టాలూ వాటినే అమలుచేస్తున్నాయి.

 

అయితే, బండి సంజయ్ హామీ ఇచ్చినట్లు...గ్రేటర్  కార్పొరేషనే ట్రాఫిక్ చలాన్లు చెల్లించడం లేదా రద్దు చేయడం వంటి చర్యలను.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కూడా అమలుచేస్తున్న దాఖలాలు కనిపించవు. మరి ఒక్క ‘గ్రేటర్’లోనే ఆ విధానం ఎలా అమలుచేస్తారన్న సందేహం, గ్రేటర్‌లో విద్యాధికుల నుంచి వినిపిస్తోంది. పైగా 18 వేల కోట్ల గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ బడ్జెట్‌లో,  జీతాలకు పోగా మిగిలేది అ తి స్వల్పమయినప్పుడు... ఇక ట్రాఫిక్ చలాన్ల రూపంలో వచ్చే బిల్లులు ఏవిధంగా.. ఎక్కడి నుంచి ఇస్తారన్నది మరో ప్రశ్న.

 

ఎందుకంటే.. ఒక్క 2019 జూన్ వరకే,  5.2 లక్షల కేసులకు గాను... 9.12 కోట్ల రూపాయలు చలాన్ల రూపంలో వసూలయ్యాయి. 2018లో 6.79 కోట్లు, 2017లో 8.84 కోట్లు, 2016లో 10.98 కోట్లు, 2015లో 11.30 కోట్లు, 2014లో 21.63 కోట్లు చలాన్ల రూపంలో ఖజానాకు చేరాయి. మరి ఈ డబ్బును గ్రేటర్ కార్పొరేషన్,  పోలీసులకు ఎలా చెల్లిస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మద్యం తాగి డ్రైవింగ్ చేసేవారి నుంచి, 3 కోట్ల రూపాయల చలాన్లు వసూలు చేశారు. మద్యం తాగుతూ డ్రైవింగ్ చేయడం నేరం. అందుకే బీజేపీ అధికారంలో ఉన్న కేంద్రప్రభుత్వమే భారీ చలాన్లు విధించింది. మరి ఒకవేళ బీజేపీ గ్రేటర్‌లో గెలిస్తే... మద్యం తాగుతూ పట్టుపడ్డ వాహనదారులకు విధించే చలాన్లు, అదే బీజేపీ చెల్లిస్తే.. అది కేంద్ర విధానాన్ని ధిక్కరించినట్లే కదా? మద్యం తాగుతూ వాహనాలు నడపటాన్ని ప్రోత్సహించినట్లు కాదా అన్నది మరో ప్రశ్న.

 

ఇక ఎల్‌ఆర్‌ఎస్ రద్దు కూడా,  గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిథిలోని అంశం కాదు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాల్సిందే. చివరకు బీఆర్‌ఎస్, బీపీఎస్ వంటి స్కీములు కూడా ప్రభుత్వం ఆమోదిస్తేనే..  గ్రేటర్ కార్పొరేషన్ అమలుచేయాల్సి ఉంటుంది. మరి ఏ అధికారంతో..  బీజేపీ,  ఎల్‌ఆర్‌ఎస్ రద్దు హామీ ఇచ్చిందన్న అంశంపైనే  ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.  బీజేపీ పట్ల  మధ్య తరగతి-విద్యాధికులలో ఇప్పటివరకూ సానుభూతి ఉంది. ఇలాంటి అసాధ్యమైన హామీలు గుప్పించడం ద్వారా, ఆ సానుభూతి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు.

-మార్తి సుబ్రహ్మణ్యం

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.