కేటీఆర్ కోసం కేసీఆర్ దోష నివారణ పూజలు!
Published on: Wed Jan 20, 2021 3:38PM
కేసీఆర్ సీఎంగా తప్పుకోనున్నారా ? కేటీఆర్ కు పాలనా పగ్గాలు అప్పగించనున్నారా ? తెలంగాణలో కొన్ని రోజులుగా ఇదే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం కూడా ఖరారైందని కొందరు చెబుతుండగా... అలాంటేది ఉండదు మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని మరికొందరు వాదిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ లోనే కాదు... విపక్షాల రాజకీయాలు కూడా ముఖ్యమంత్రి ఎవరన్నదానిపైనే తిరుగుతున్నాయి. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
తన కుమారుడు కేటీఆర్ ని సీఎం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్ లో మూడు రోజుల పాటు దోష నివారణ పూజలు నిర్వహించారని బండి సంజయ్ అన్నారు. దోష నివారణ పూజకు
ఉపయోగించిన పూజ సామగ్రిని త్రివేణి సంగమంలో కలిపేందుకే కుటుంబ సమేతంగా కేసీఆర్ కాళేశ్వరానికి వెళ్లారని ఆరోపించారు. కాళేశ్వరంలో కేసీఆర్ దంపతులు ఏం కలిపారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు మాత్రమే కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు బండి సంజయ్. కేటీఆర్ సీఎం కావడం నిజమైన ఉద్యమకారులకు ఇష్టం లేదని అన్నారు.
మంత్రి ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పారు బండి సంజయ్. ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఈటలను ముందు పెట్టి కేసీఆర్ బయటపడుతున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ సీఎం అయినా, కాకపోయినా తమకు ఒకటేనని సంజయ్ చెప్పారు. కేటీఆర్ సీఎం కావడాన్ని ఇష్టపడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే బీజేపీలో చేర్చుకుంటామని... అయితే వారికి అవినీతి మరకలు ఉండకూడదని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పారని... ఇప్పటికైనా ఆ పని చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ చేసే పూజలన్నీ ఆయన కుటుంబ బాగుకోసమేనని... తాము చేసే పూజలు సమాజ హితం కోసమని అన్నారు బండి సంజయ్.


