హైడ్రా పేరుతో దండుకుంటున్నారు.. బండి..!
Published on: Mon Sep 30, 2024 7:01PM

చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నహైడ్రా నిత్యం నగరంలో ఎక్కడో ఒకచోట కూల్చివేతలు చేపడుతూ వార్తల్లో నిలుస్తోంది. అయితే రోజు రోజుకూ హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం కూడా వెల్లువెత్తుతోంది. దీనిపై బీఆర్ఎస్, బీజేపీలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. తాజాగా హైడ్రాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ హైడ్రా పేరిట రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ వేల కోట్లు దండుకుంటోందని ఆరోపించారు. కరీంనగర్‌లో ఈ రోజు విలేకరులతో మాట్లాడిన ఆయన కాళేశ్వరం పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందనీ, ఇప్పుడు హైడ్రా పేరిట కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటోందని విమర్శించారు. బాధితుల తరఫున బీజేపీ నిలబడుతుందన్నారు. బీజేపీ ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందన్న ఆయన.. వారి కోసం ఒంటరిగానే పోరాటం చేస్తామని తెలిపారు.


