కేసీఆర్.. గోడ మీద పిల్లి
Published on: Fri May 10, 2019 11:45AM

మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ గోడ మీద పిల్లి లాంటి వారని, చంద్రబాబు అవకాశవాది అని విమర్శించారు. మరోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడం, నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమి, ఫెడరల్ ఫ్రంట్ అనేవి తమ దరిదాపుల్లో కూడా ఉండే అవకాశం లేదన్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ ఆరు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చిందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌పై కేసీఆర్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని.. కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.52 వేల కోట్లకు పెంచారని దత్తాత్రేయ ఆరోపించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.80 వేలకు పెంచి ఇంత వరకు ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. ఇంటర్ బోర్డ్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చినా గ్లోబరీనా సంస్ధపై ఎందుకు చర్యలు తీసుకోలేదని దత్తాత్రేయ ప్రశ్నించారు.


