నాకు గవర్నర్ గిరి వద్దు

కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కోల్పోయిన తర్వాత బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ రాజకీయాల్లో కొనసాగుతారా..? బీజేపీకి రాం రాం చెబుతారా..? లేక బీజేపీ ఆయన్ను గవర్నర్‌గా పంపిస్తుందా అంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు హల్‌చల్ చేశాయి. గత కొద్దిరోజులుగా దత్తన్నకు గవర్నర్ పోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందంటూ వార్తలు వినిపించాయి. ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు దత్తాత్రేయ.. తాను గవర్నర్‌గా వెళ్లనని.. ప్రజలతోను ఉంటానని.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని చెప్పారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్ట్‌లకు కేంద్రం భారీ సాయం చేసిందని దత్తాత్రేయ అన్నారు. మిషన్ భగీరథకు రూ.3,900 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.677 కోట్లు ఇచ్చిందని.. పనుల వేగవంతానికి కేంద్రప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని దత్తన్న చెప్పారు.