అరటి అంటే అంత అలుసా!

రోజుకో ఆపిల్ తింటే ఆహారంగా- ఉంచుతుంది డాక్టర్ ని దూరంగా. ఇది అసలు మన భారతీయ వాతావరణానికి సరిపోయే మాట కానే కాదు. నిజానికి మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో  పండే పళ్ళని మనం తింటే అవి మన ఒంటికి సరిగా సరిపోతాయట. అంటే అరటి, జామ, కమలా, బొత్తాయి, నేరేడు ఇలాంటివి మన వాతావరణంలో పండే పళ్ళు కాబట్టి ఇవి మన వంటికి కరెక్ట్ గా సూట్ అయ్యే పళ్ళు. వీటిలో అరటిపండు మనకి ఏడాది మొత్తం సులువుగా దొరుకుతుంది.


కాని చేతికి అందుబాటులో ఉండటం వల్ల అరటి అంటే చాలా మందికి చులకన. నిజానికి ఒక అరటిపండులో 70% నీరు  ఉంటుందిట. ఎండాకాలంలో దీనిని తినటంవల్ల మనకి త్వరగా అలసట రాదు. అంతే కాదు ఒంట్లో నిస్సత్తువని కూడా దూరం చేస్తుందిట.

 

 

*  అరటిపండు తినటం వల్ల హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుందిట. న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ వారు ఈ పండు తింటే గుండెపోటు 40% తగ్గే వీలుందని ప్రకటించారు కూడా.

*  దీనిలో  పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండె సరిగా పనిచేసేలా చేస్తుంది. ఈ పొటాషియం కిడ్నీలకి, ఎముకలకి కూడా బలాన్నిస్తుంది.


*  దీనిలో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది. ఆహ్హారం అరుగుదలకు తోడ్పడుతుంది.

*  కడుపులో అల్సర్లు ఉన్నవారికి ఇదొక మంచి ఔషధం. కడుపు మంటని చక్కగా తగ్గిస్తుంది.

*  విటమిన్ B6 చాల ఎక్కువగా ఉండటం వల్ల ఇది హిమోగ్లోబిన్ తయారుకావటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

*  ఈ అరటిపండులో విటమిన్ సి, మెగ్నీషియం, మెంగనీస్ కూడా ఉండటం తో ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

*  మన అలసిపోయినపుడు ఒక్క అరటిపండు తింటే చాలు పోయిన ఓపిక తిరిగి వస్తుంది. ఇది ఒంట్లో శక్తిని పెంచటమే కాదు, స్ట్రెస్ ని కూడా బాగా తగ్గిస్తుంది.

 

 

*  రాత్రి పూట అరటి పండు ఒక గ్లాసు పాలు తాగితే నిద్ర హాయిగా పడుతుంది కూడా. నిద్ర కి కూడా ఇది మంచి మందులాంటిది.

డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.

* అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది.

సంస్కృతంలో కదళి ఫలంగా పిలిచే అరటిపండు ఎన్నో ఉపయోగాలకు పుట్టినిల్లు లాంటిది. ఒకప్పుడు ప్రతి పెరడులోను ఈ చెట్టు కనిపించేది. కేవలం పండు మాత్రమే కాదు అరటికాయ కూడా ఒంటికి ఎంతో  మేలు చేస్తుంది. అరటి అక్కులో భోజనం చేస్తే తిన్నది చక్కగా అరిగి జీర్ణ సంభందిత వ్యాధులు దగ్గరకి కూడా రావు. ఇన్ని ఉపయోగాలు ఉన్న అరటిని రోజుకి ఒకటైన తినటం అలవాటుగా మార్చుకుంటే ఎన్నో వ్యాధులు రాకుండా చెక్ పెట్టచ్చు.

- కళ్యాణి