ఇండియన్స్ కూ అమెరికా బహిష్కరణ ముప్పు!?
Published on: Fri Mar 7, 2025 10:59AM

అమెరికాలో వలసదారుల పై కన్నెర్ర చేస్తున్న ట్రంప్ చూపు ఇప్పుడు ఇండియన్స్ పై కూడా పడిందా? వీసా గడువు ముగిసిన వారిపై చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు అక్కడితో ఆగుతాయా? ఇప్పుడు ఈ విషయంపైనే అమెరికాలో ఉన్న పలువురు భారతీయులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.
ఇప్పటికిప్పుడైతే వీసా గడువు ముగిసిన దాదాపు లక్ష మంది అమెరికా బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. హెచ్4 డిపెండెంట్ వీసా తో హెచ్1 బీ వీసా ఉన్న తల్లిదండ్రులతో కలిసి వచ్చిన పిల్లలకు 21 ఏళ్లు నిండడమే తాజా ఆందోళనకు కారణం.మైనర్లగా అమెరికా వెళ్లిన వీరికి 21ఏళ్లు నిండే వరకూ మాత్రమే ఈ వీసా పనిచేస్తుంది.కొత్త వీసా పునరుద్ధరణకు రెండేళ్ల గడువు ఉంటుంది.కాని ట్రంప్ హయాంలో ఈ గ్రేస్ పీరియడ్ లో కోతలు ఉంటాయన్న భయం వ్యక్తం అవుతోంది. డిపెండెంట్ వీసా ముగిసిన పిల్లల సంఖ్య దాదాపు లక్షా 34 వేలు ఉంటుంది.వీసా ముగిసిన వారు ఉన్నత చదువుల కోసం స్టూడెంట్ వీసా అవకాశం ఉంది.అయితే అది లభించడం అంత సులువేమీ కాదు. వీసా పునరు ద్ధరణకు రెండేళ్ల సడలింపు పై న్యాయస్థానాల అభిప్రాయాలు కొత్తగా ఆందోళనకు కారణ మౌతున్నాయి.
ఇప్పటివరకూ సరైన పత్రాలు లేని వారికి డీఏసీఏ నిబంధన రక్షణ కల్పించేది. కాని న్యాయస్థానం ఆ రక్షణ చట్టవిరుద్ధమని తీర్పు చెప్పింది. దీంతోనే అమెరికాలో డిపెండెంట్ వీసాపై ఉన్న వారిలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.


