ఏపీలో సీఎం వాట్సాప్ పోయింది

 

నకిలీ వార్తలు, వివాదాస్పద పోస్టులపై సోషల్ నెట్వర్క్స్ కొరడా జుళిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు..వారి అకౌంట్లపై నిషేధం విధిస్తున్నాయి. ఈ జాబితాలో రాజకీయనాయకులు ఉన్నా ఉపేక్షించట్లేదు. తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌‌కు చెందిన వాట్సాప్ అకౌంట్‌పై ఆ సంస్థ వేటు వేసింది. సీఎం రమేష్‌ వాట్సాప్ సేవలను వాడుకునే హక్కును కోల్పోయారని ఆ సంస్థ వివరించింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయనాయకుల్లో వాట్సాప్ నిషేధానికి గురైన మొట్ట మొదటి వ్యక్తి సీఎం రమేష్.

 

 

వివరాలిలా ఉన్నాయి..కొద్దిరోజులుగా సీఎం రమేష్ వాట్సాప్ ఖాతా పనిచేయడం లేదు. దీనిపై ఆయన వివరణ కోరుతూ వాట్సాప్ సంస్థకు లేఖ రాశారు. నియమ నిబంధనలు ఉల్లంఘించారని, దీనిపై చాలా ఫిర్యాదులు అందాయని అందుకే సేవలు నిలిపివేశామని సంస్థ నుంచి సమాధానం వినిపించింది. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను కాపాడే చర్యల్లో భాగంగా ఫిర్యాదుదారుల వివరాలు మాత్రం అందజేయలేమని వాట్సాప్ సంస్థ స్పష్టం చేసింది. కాగా తన వాట్సాప్ నిషేధానికి గురవ్వటం వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని సీఎం రమేష్‌ ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ వాట్సాప్ అకౌంట్ కే సమస్యలపై తనకు ఫిర్యాదు చేస్తుంటారని..ఇలా హఠాత్తుగా నిషేధం విదిస్తే వారితో ఎలా టచ్ లో ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.