TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెళ్లిని పెటాకులు చేసిన బట్టతల..!

Published on: Tue May 24, 2022 2:40PM

పెళ్లి కోసం ఆ యువకుడు వంద అబద్ధాలేం చెప్పలేదు.. ఒకే ఒక విషయం దాచాడంతే.. సరిగ్గా పెళ్లి పీటల మీద ఆ దాచిన రహస్యం కాస్తా బట్టబయలైంది. అంతే పెళ్లి కూతురు పెళ్లే వద్దంటూ పీటల మీదే పెళ్లిని ఆపేసింది. ఇంతకీ జరిగిందేమిటంటే.. బట్టతల ఉందని సిగ్గుపడుతూ ఓ యువకుడు విగ్గుతో మేనేజ్ చేస్తున్నాడు. ఆ యువకుడికి పెళ్లి కుదిరింది. వధూవరులిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు.

తీరా ముహూర్తం సమీపించేసరికి పెళ్లి పీటల మీదే  ఆ యువకుడి విగ్గు ఊడిపోయి బట్టతల బండారం బైట పడింది. అంతే పెళ్లి కూతురు అగ్గిమీద గుగ్గిలమైపోయింది. బట్టతల కుర్రోడితో తనకు పెళ్లి వద్దంటే వద్దంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ లో జరిగింది.  ఇంతకీ వదువుకు అంత కోప మెందుకొచ్చిందంటే..బట్టతల విషయం దాచి పెట్టినందుకు. ఇంత చిన్న విషయం కూడా దాచిపెట్టే వరుడు రేపు పెళ్లయిన తరువాత ఇంకా ఏంఏం దాచిపెడతాడో అన్న అనుమానం ఆమెను పెళ్లే వద్దనుకునేలా చేసింది.

చిన్న విషయమే కదా సర్దుకు పొమ్మంటూ పెళ్లి పెద్దలు ఎంత నచ్చ చెప్పినా పెళ్లి కూతురు ససేమిరా అంది. దీంతో చేసేది లేక పెళ్లి ఆపేశారు. ఇదంతా మీ వల్లే జరిగిందంటూ పెళ్లి కూతురు తరఫు వారు పెళ్లి కుమారుడి సంబంధీకులపై తిట్ల దండకం కురిపించారు. అంతే కాదు..తమను మోసం చేశారంటూ వరుడి కుటుంబీకులపై పోలీసు కేసు కూడా పెట్టారు.  పోలీసులు కూడా ఇరు వర్గాలకూ నచ్చ చెప్పి పెళ్లి యధావిధిగా జరిపించేందుకు వారి వంతు ప్రయత్నం వారు చేశారు.  

అయినా పెళ్లికూతురు సమాధాన పడక పోవడంతో మిన్నకుండి పోయారు. కానీ పెళ్లి కూతురి తరఫు వారు మాత్రం తమకు పెళ్లి కోసం ఐదున్నర లక్షల రూపాయలు ఖర్చైందనీ, ఆ మొత్తం ఇచ్చి తీరాలనీ పట్టుబట్టారు. చేసేదేం లేక పోలీసుల సమక్షంలోనే ఆ మొత్తం వధువు తరఫువారికి ఇచ్చేందుకు అంగీకరించి పెళ్లి కొడుకును తీసుకుని వారు వెళ్లి పోయారు. బట్టతల ఉందన్న చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకుని దాచి పెట్టినందుకు బాధపడుతూ పెళ్లి కొడుకు బట్టతల నిమురుకుంటూ కుమిలిపోయాడు.