TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్లస్‌.. మైనస్ అయితే?.. జూనియ‌ర్‌పై బాల‌య్య డైలాగ్‌కి అర్థ‌మేంటి?

Published on: Fri Jun 11, 2021 11:42AM

బ‌ర్త్‌డే రోజు నంద‌మూరి బాల‌కృష్ణ చేసిన న‌ర్మ‌గ‌ర్బ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై బాల‌య్య బాబు చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌. అందులోనూ ఆ డైలాగ్స్‌.. బాల‌య్య స్టైల్‌లో అర్థం అయీ, అవ‌న‌ట్టు.. క్లారిటీ ఇచ్చీ, ఇవ్వ‌న‌ట్టు.. ఉండ‌టంతో మ‌రింత‌ క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేస్తున్నాయి. డోంట్ ట్ర‌బుల్ ద ట్ర‌బుల్‌.. ఇఫ్ యు ట్ర‌బుల్స్ ద ట్ర‌బుల్‌.. ట్ర‌బుల్ ట్ర‌బుల్స్ యు... ఐయామ్ నాట్ ద ట్ర‌బుల్‌.. అన్న రేంజ్‌లో ఉంది బాల‌కృష్ణ.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై వ‌దిలిన డైలాగ్‌.  

బాల‌య్య‌కు అబ‌ద్దం ఆడ‌టం అస్స‌లు తెలీదు. ఉన్న‌ది ఉన్న‌ట్టు.. కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడుతారు. ఆయ‌న స్టేట్ ఫార్వ‌ర్డ్ గానే మాట్లాడుతారు కానీ, జ‌నానికే ఆయ‌న ఏం మాట్లాడారే, ఆయ‌న మాట‌ల మ‌ర్మ‌మేంటో అంత ఈజీగా అర్థం కాదు. అదే బాల‌య్య బాబు స్పెషాలిటీ. సినిమా ఫంక్ష‌న్ల‌లో సినిమాల గురించో, తెలుగు సాహిత్యం, గొప్ప‌దనం, ఆ రోజుల్లో, నాన్న‌గారు గురించో అయితే ఓకే. అంత‌గా అర్థం కాక‌పోయినా ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు. కానీ, బాల‌కృష్ణ త‌న పుట్టిన రోజున‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయ ప్ర‌వేశంపై చెప్పిన అభిప్రాయంపై ఇప్పుడు తెలుగునాట పోస్ట్‌మార్టం అవుతోంది. ఏ ఇద్ద‌రు క‌లిసినా.. బాల‌య్య డైలాగ్‌కు మీనింగ్ ఏంటా? అని తెగ చ‌ర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ బాల‌కృష్ణ ఏమ‌న్నారంటే... 

‘‘ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్లవి. ఎన్టీఆర్‌ రాజకీయాల్లో వస్తారా? లేదా? అనే దాని గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదు’ అని సమాధానం ఇచ్చారు. ఈ ఆన్స‌ర్ క్లారిటీగానే ఉంది. ఇందులో ఎలాంటి క‌న్ఫ్యూజ‌నూ లేదు. అంతా జూనియ‌ర్ ఇష్టం.. త‌న‌కేమీ సంబంధం లేద‌న్న‌ట్టు స‌మాధానం చెప్పారు బాల‌కృష్ణ‌. ఆ త‌ర్వాతే అస‌లైన ఆన్స‌ర్ వ‌చ్చింది ఆయ‌న నోటి నుంచి. అదేంటంటే....

ఎన్టీఆర్‌ రాజకీయాల్లో వస్తే టీడీపీకి ప్లస్‌ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అని అడగ్గా.. బాలకృష్ణ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నవ్వి ఊరుకున్నారు. కొన్నిక్ష‌ణాల త‌ర్వాత స్పందిస్తూ.... ‘ఒకవేళ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్లస్‌ అయి మైనస్‌ అయితే’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ చిన్న పాయింటే ఇప్పుడు నంద‌మూరి అభిమానుల‌ను పిచ్చెక్కిస్తోంది. మా బాల‌య్య బాబు అస‌లేమ‌న్నారంటూ? ఫ్యాన్స్ ప‌రేషాన్ అవుతున్నారు. బాల‌కృష్ణ మాట‌ల మ‌ర్మ‌మేంటంటూ మేధోమ‌ధ‌నం జ‌రుగుతోంది.

ప్ల‌స్ అయి మైన‌స్ అయితే? చిన్న స్టేట్‌మెంట్ అయినా.. ఇందులో నుంచి ఎంతో అర్థాన్ని, ప‌ర‌మార్థాన్ని బ‌య‌ట‌కు తీస్తున్నారు. విత్తు నుంచి మ‌హావృక్షం పుట్టుకొచ్చిన‌ట్టు.. ఈ డైలాగ్ నుంచి జూనియ‌ర్ రాజ‌కీయ భ‌విష్య‌త్ ముఖ‌చిత్రాన్ని ఆవిష్క‌రిస్తున్నారు. ప్ల‌స్ అయి మైన‌స్ అయితే? అంటే.. ముందు ప్ల‌స్ అయి.. ఆ త‌ర్వాత మైన‌స్ అయితే.. ఎలా అనేదే బాల‌కృష్ణ ప్ర‌శ్న‌. అనుమాన‌మూ కూడా. ఈ డైలాగ్‌ను జూనియ‌ర్ గ‌త పొలిటిక‌ల్ యాక్టివిటీతో కంపేర్ చేసి కాస్త క్లారిటీ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 

2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున దాదాపు నెల పాటు విస్తృతంగా ప్ర‌చారం చేశారు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. పెద్ద ఎన్టీఆర్‌లానే ఖాకీ డ్రెస్ వేసుకొని.. చైతన్య‌ర‌థంపై ప్ర‌చారాన్ని హోరెత్తించారు. ఎన్టీఆర్ అడుగుపెట్టిన ప్ర‌తీచోటా జ‌న ప్ర‌భంజ‌న‌మే. ఆక‌ట్టుకునే ప్ర‌సంగం.. తూటాల్లాంటి వాగ్ధాటితో.. తెలుగు త‌మ్ముళ్ల‌లో ఫుల్ జోష్ తీసుకొచ్చాడు ఈ బుడ్డోడు. ఆ నెల రోజులూ జూనియ‌ర్ క్యాంపెయిన్‌తో పార్టీకి బాగా లాభం జ‌రిగింది. అదంతా ప్ల‌స్‌. 

క‌ట్ చేస్తే.. ఫ‌లితాలు వ‌చ్చాక టీడీపీ ప‌రాభ‌వం పాలైంది. 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయింది. ప్ర‌త్యేకించి జూనియ‌ర్ ఎన్టీఆర్ ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే ప్ర‌చారం నిర్వ‌హించారో.. ఆయా చోట్ల టీడీపీ సిట్టింగ్ స్థానాల‌ను కూడా కోల్పోయింది. ఎన్టీఆర్ ప్ర‌భావం అస‌లేమాత్రం క‌నిపించ‌లేదు అక్క‌డ‌. అందుకే, అది పార్టీకి బిగ్ మైన‌స్‌. 

సో.. ప్ర‌చారం అనే ప్ల‌స్‌.. ఓట‌మి అనే మైన‌స్‌.. ఆ రెండిటినీ క‌లిపి.. గ‌తాన్ని భ‌విష్య‌త్తుకు అప్లై చేసి..  ‘ఒకవేళ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్లస్‌ అయి మైనస్‌ అయితే’ అంటూ బాల‌కృష్ణ వ‌దిలిన‌ పొలిటిక‌ల్ ఈక్వేష‌న్‌ను సాల్వ్ చేస్తున్నారు పొలిటిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్స్‌. ఆయ‌న మాట‌ల‌కు అర్థాలే వేర‌ని.. ఆ అర్థం ఇదేనంటూ ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చేస్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంట్రీతో ప్ర‌చారం మేర‌కు ప్ర‌యోజ‌నం క‌లిగినా.. బుడ్డోడికి టీడీపీని గెలిపించేంత స‌త్తా లేద‌నే అనుమానం బాల‌య్య వ్య‌క్తం చేశార‌ని అంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డిని ఢీ కొట్ట‌గ‌ల‌ స‌త్తా, స‌త్తువా.. త‌న బావ చంద్ర‌బాబు, త‌న అల్లుడు లోకేశ్‌ల‌కే ఉంద‌ని భావిస్తున్నారు కాబోలు బాల‌య్య బాబు. ఒక‌వేళ టీడీపీకి అంత‌లా అవ‌స‌ర‌మైతే.. న‌ట‌సింహం.. పొలిటిక‌ల్‌ లెజెండ్.. ప్ర‌జ‌ల్లో అఖండ అద‌ర‌ణ ఉన్న.. బాల‌కృష్ణ అనే నేను.. పార్టీకి అండ‌గా ఉండ‌నే ఉన్నానుగా అనేది బాల‌య్య మాట‌ల మ‌ర్మ‌మ‌ని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి అలా.. బర్త్‌డే రోజున బాల‌య్య వ‌దిలిన డైలాగ్‌పై.. క‌న్ఫ్యూజ‌న్‌లో కాస్త‌ క్లారిటీ.. క్లారిటీలో కాస్త‌ కన్ఫ్యూజ‌న్.... ఎంతైనా బాల‌య్యా మ‌జాకా.