తార‌క్ పొలిటిక‌ల్ ఎంట్రీపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు!!

ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నారు. అయితే, తారక్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, రాజకీయాల్లో తన పేరు బాగానే వినిపిస్తూ ఉంటుంది. ఆయన తాతగారు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరఫున.. 2009 ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించిన తారక్.. ఆ తరువాత పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అయితే, కొందరు అభిమానులు, టీడీపీ శ్రేణులు మాత్రం తారక్ పొలిటికల్ ఎంట్రీపై చర్చిస్తూనే ఉంటారు. ఆయన ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రావాలని, ఆయనకు తెలంగాణలో టీడీపీ పగ్గాలు అప్పగించాలని ఇలా రకరకాలుగా అభిప్రాయపడుతుంటారు. అయితే, తారక్ మాత్రం తన ఫోకస్ అంతా సినిమాల పైనే పెడుతున్నారు. కాగా, తాజాగా తారక్ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి నంద‌మూరి బాల‌కృష్ణ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాల‌కృష్ణకు తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. "జూనియర్ ఎన్టీఆర్‌ లాంటి వ్య‌క్తులు కూడా పూర్తిస్థాయి రాజ‌కీయాల్లోకి వస్తే అటు తెలంగాణ‌, ఇటు ఆంధ్రా‌లో పార్టీకి పూర్వ వైభ‌వం వ‌స్తుంది అనే వాద‌న ఉంది" అంటూ యాంకర్ అడిగారు. దీనిపై స్పందించిన బాలకృష్ణ.. ‘‘అది డేడికేష‌న్‌ను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది" అన్నారు. "అదీగాక మీరు ఫుల్ టైమ్ పాలిటిక్స్ అంటున్నారు. త‌న‌కు సినిమా యాక్ట‌ర్‌గా చాలా భవిష్య‌త్తు ఉంది. మ‌రి వాడిష్టం. ప్రొఫెష‌న్ వ‌దులుకుని ర‌మ్మ‌నముగా. ఇప్పుడు నేనున్నాను ఎమ్మెల్యేగా ఉన్నాను, సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నాను. నాన్న‌గారు కూడా సీఎంగా ఉన్న‌ప్పుడు సినిమాల్లో యాక్ట్ చేశారు. కాబ‌ట్టి వారి వారి ఇష్టాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది’’ అని బాలకృష్ణ సమాధానమిచ్చారు.