TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జిల్లా సాధన కోసం "అఖండ" దీక్ష

Published on: Fri Feb 4, 2022 12:04PM

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ వైపు ఆందోళనలు మరోవైపు మద్దతుగా ర్యాలీలు కొనసాగుతుండగా.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సీన్‌లోకి రావడం కొత్త ఆసక్తిని రేపుతోంది. సత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని కేంద్రంగా చేయాలంటూ పోరాట బాట పట్టారు బాలకృష్ణ. శుక్రవారం హిందూపురంలో ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్షకు దిగారు. అనంతపురం జిల్లాను రెండుగా విభజించి శ్రీత్యసాయి జిల్లాను ప్రతిపాదించింది ఏపీ ప్రభుత్వం. హిందూపురం పార్లమెంట్ స్థానంలోని ప్రాంతాలను ఈ జిల్లా పరిధిలోకి తెచ్చారు. హిందూపురాన్ని జిల్లా చేయాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాగా ప్రకటిస్తారని అనుకున్నారు అందరూ. అయితే అందుకు విరుద్దంగా పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రతిపాదించారు. దీంతో హిందూపురం వాసుల్లో ఆందోళన మొదలైంది. పార్లమెంట్ సెగ్మెంట్ హిందూపురం కాకుండా పుట్టపర్తిని ప్రకటించడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ర్యాలీలు, నిరసనలు, బంద్‌లతో తమ డిమాండ్ వినిపించారు. జిల్లాల ప్రకటన విషయంలో హిందూపురంకు తీవ్ర అన్యాయం జరిగిందంటున్నారు. అటు జిల్లా కేంద్రంగా ప్రకటించాలని హిందూపురం పురపాలక సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. 

పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే సత్యసాయి జిల్లాను హిందూపురం కేంద్రంగా ఏర్పాటు చేయాలి. అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, వాణిజ్యపరంగా, పారిశ్రామిక పరంగా కూడా హిందూపురం అభివృద్ధి చెందిన విషయం అందరికీ తెలిసిందేనని బాలకృష్ణ వాదిస్తున్నారు. జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని అర్హతలు హిందూపురానికి ఉన్నాయని, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూములు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలు గౌరవించి వారి చిరకాల కోరిక అయిన హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు బాలకృష్ణ.