TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొమ్మినేనికి బెయిలొచ్చింది.. కృష్ణంరాజుకు అంత వీజీ కాదు!

Published on: Sat Jun 14, 2025 11:03AM

రాజధాని అమరావతిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో అరెస్టయిన మరో జర్నలిస్టు కృష్ణంరాజుకు బెయిలు అంత వీజీ కాదని అంటున్నారు న్యాయనిపుణులు. కొమ్మినేనికి బెయిలు మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను, ఆయనకు బెయిలు ఇవ్వడానికి సుప్రీం చెప్పిన కారణాలను బట్టి చూస్తే కృష్ణంరాజుకు బెయిలు మంజూరు కావడం అంత వీజీ కాదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.

అమరావతిపై, అమరావతి మహిళలపై అసహ్యకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలను కొమ్మినేని చేయలేదు అన్న ఒకే ఒక్క కారణంపై సుప్రీం కోర్టులో  ఆయనకు బెయిలు ఇచ్చింది.  ఒక మీడియా చానెల్ లో ప్రసారమైన డిబేట్ లో యాంకర్ పాత్ర పోషించిన కొమ్మినేని అనుచిత వ్యాఖ్యలు చేయ లేదనీ, ఎనలిస్టుగా ఉన్న కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఖండించలేదు.. నవ్వారు అంతే..నవ్వినంత మాత్రాన అరెస్టు చేయడం సబబు కాదని సుప్రీం అభిప్రాయపడింది. అదే సమయంలో ఇక ముందు ఇటువంటి షోలు నిర్వహించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ కొమ్మినేనిని హెచ్చరించింది కూడా.  అయితే ఇదే కేసులో  అరెస్టైన కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసరా వులాగే బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించినా బెయిలు దక్కే అవకాశాలు మృగ్య మేనని అంటున్నారు.  

భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛను హరించడానికి వీల్లేదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నా.. దానిపై ఒకింత నియంత్రణ ఉండాలన్నది కూడా రాజ్యాంగంలో ఉందని అంటున్నారు.  ఈ  కారణంగానే డిబేట్ లో  జర్నలిస్టు అమరావతిపై చేసిన వ్యాఖ్యల తీవ్రత, ఒక ప్రాంతాన్ని, ఆ ప్రాంత మహిళలను అవమానించేలా, కించపరిచేలా ఉన్న ఆయన మాటలు కచ్చితంగా అభ్యంతరకరమేనని, ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కొమ్మినేనికి బెయిలు ఇస్తూ పరోక్షంగా పేర్కొందనీ అంటున్నారు. అనలిస్టు చేసిన తప్పుకు యాంకర్ ను శిక్షిస్తారా? అన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యల సారాంశం కృష్ణంరాజు చేసినవి కచ్చితంగా అనుచిత వ్యాఖ్యలేనని పరోక్షంగా చెప్పడమే అనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కృష్ణంరాజుకు బెయిలు మంజూరు కావడం అంత ఈజీ కాదని చెబుతున్నారు.