బాహుబలి సినిమా రిలీజ్ డేట్???

 

గత మూడేళ్ళుగా కొనసాగిన బాహుబలి సినిమా షూటింగ్ ఇంకా ఎప్పటికి పూర్తవుతుంది? రాజమౌళి ఎప్పటికయినా సినిమాని రిలీజ్ చేస్తారా? లేకపోతే శిల్పం చెక్కుతున్నట్లుగా సినిమాను చెక్కుకొంటూనే కూర్చోంటారా?అని ప్రభాస్ అభిమానులు, ఆ సినిమా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న ప్రజలు అందరూ కూడా గుర్రుగా ఉన్నారనే సంగతి రాజమౌళికి కూడా తెలుసు. చివరికి బాహుబలి సినిమా రిలీజ్ పై ఆ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలోనే నిర్వాహకులు రెండు వ్యంగ్య వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించడంతో రాజమౌళితో సహా అందరూ హాయిగా నవ్వుకొన్నారు.

 

మొదటిది బొమ్మరిల్లు సినిమాలో క్లైమాక్స్ సీన్ లో ప్రకాష్ రాజ్, హీరో సిద్దార్ధ మధ్య జరిగిన చాలా పాపులర్ డైలాగ్స్ ఉన్న వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించి, అందులో వారిరువురి డైలాగ్స్ ని మార్చి బాహుబలి సినిమా రిలీజ్ ఇంకా ఎప్పుడు? అని సిద్దార్ధ చేత ప్రకాష్ రాజ్ ని అడిగించడం అందరినీ కడుపుబ్బ నవ్వించింది. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన సుమ కార్యక్రమం మొదటి నుండి సినిమా రిలీజ్ గురింఛి సరదాగా చురకలు వేస్తూనే ఉన్నారు.

 

ఆమె బాహుబలి సినిమాని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుతో పోల్చుతూ వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించి మెట్రో రైల్ నిర్మాణం సాగుతూనే ఉంది...బాహుబలి సినిమా కూడా సాగుతూనే ఉంది...సాగుతూనే ఉంది...ఇంకా సాగుతూనే ఉంది......ఎలాగో ఇప్పటికి ఆడియో రిలీజ్ కార్యక్రమం వరకు వచ్చింది...మెట్రో రైల్ ప్రాజెక్టులాగే...అయినా ఇప్పటికీ బాహుబలి సినిమా రిలీజ్ ఎప్పుడో ఎవరికీ తెలియదు...మెట్రో రైల్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు...”అని ఆమె తనదయిన శైలిలో పలికిన మాటలకు రాజమౌళితో సహా అందరూ హాయిగా నవ్వుకొన్నారు.

 

ఈ కార్యక్రమంలో ఆడియో రిలీజ్ కంటే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే అందరూ రాజమౌళిని ప్రశ్నిస్తుండటం దానికి రాజమౌళి ముసిముసినవ్వులే జవాబులుగా ఇచ్చేరు సమాధానం చెప్పలేదు. తన సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో తన సినిమా రిలీజ్ డేట్ గురించే వ్యంగ్యంగా వీడియోలు ప్రదర్శించడానికి రాజమౌళి అంగీకరించడం, యాంకర్ సుమతో సహా అందరూ ఎన్ని వ్యంగాస్త్రాలు సందిస్తున్నా దానిని ఆయన మనసారా ఆనందించడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది.

 

ఈ కార్యక్రమంలోనయినా సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారని అందరూ ఆశగా ఎదురుచూసారు. కానీ రాజమౌళి బయటపడలేదు. అందరి కంటే ఆఖరిగా మాట్లాడిన హీరో ప్రభాస్ తన ప్రసంగం ముగిస్తూ రాజమౌళిని మళ్ళీ అదే ప్రశ్న అడగడంతో జనాలు కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమం ముగించే ముందు ప్రభాస్ నోటి ద్వారానే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం రాజమౌళి ఉద్దేశ్యం కావచ్చును.అందుకే చివరి వరకు ఆయన ఎవరు ఎన్ని సార్లు అడిగినా బయటపడలేదు. చివరిగా ప్రభాస్ ద్వారా బాహుబలి సినిమా రిలీజ్ డేట్ ప్రకటింపజేసి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రభాస్ అభిమానులని, తిరుపతి ప్రజలని, టీవీ ద్వారా లైవ్ టెలీకాస్ట్ చూస్తున్న వారిని అందరినీ కూడా ఆనందపరిచారు. బాహుబలి సినిమా జూలై 10వ తేదీన విడుదల అవుతుందని ప్రభాస్ ప్రకటించారు. అంటే సరిగ్గా మరొక మూడు వారాలలోనన్న మాట! చాలా మంచి మాట చెప్పావు డార్లింగ్!