TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ ఆగడాలపై తిరుగుబాటు

Published on: Tue Feb 14, 2012 1:57PM

కడప: కడపజిల్లా బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే కమలమ్మ ఆమె కుటుంబ సభ్యుల ఆగడాలపై రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు యుద్ధం ప్రకటించారు. కమలమ్మ, ఆమె బంధుగణం అరాచకాలను వెంటనే నిలిపివేయకపోతే తాము ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని వారు హెచ్చరించారు. సాధారణంగా ఒక్కో నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంటారు. కానీ బద్వేలు నియోజకవర్గలో మాత్రం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే కమలమ్మతోపాటు ఆమె భర్త, మరదలు, కుమారులు అంతా ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారని రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వీరి ఆగడాలను  అరికట్టడానికి ఏడు రెవెన్యూ మండలాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోరుమామిళ్ళ తాహసిల్దారు కార్యాలయంలో ఎమ్మెల్యే భర్త వీరంగం చేసి టేబుల్ పై అద్దాన్ని పగులగొట్టడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బద్వేలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆమె భర్త, మరదలు, కుమారులు ఎవరో ఒకరు ఫోన్ చేయడం ఆ పని చేయి, ఈ పని చేయి అని ఆదేశించడం, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే వేధింపులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆగడాలకు నిరసనగా ఈ నెల 15 నుంచి ప్రత్యక్ష్య కార్యాచరణకు దిగుతున్నట్లు రెవెన్యు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేదనాయకం తెలిపారు.