చింతామణి నిషేధం.. అదన్నమాట పాయింట్
Published on: Thu Feb 3, 2022 3:29PM
నటుడిని పెద్దగా చూపించేది వెండి తెర.. నటుడిని చిన్నగా చూపించేది బుల్లి తెర... కానీ నటుడిని నటుడుగా చూపించేదే నాటకం. అందుకే నాటక ప్రక్రియ.. శతాబ్దం క్రితమే ప్రారంభమైంది. ఆ క్రమంలో వచ్చినవే కన్యాశుల్కం అయినా... చింతమణి అయినా.. వరవిక్రయం అయినా... మరేవైనా. అయితే చింతమణి నాటకాన్ని ఇటీవల వైయస్ జగన్ ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపథ్యంలో ఈ నాటకం రద్దు కారణంగా చాలా మంది కళాకారులు రోడ్డున పడ్డారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. దీనిని అత్యవసర పిటిషన్‌గా స్వీకరించి... విచారించాలంటూ పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు. అయితే అంతకుముందే ఈ నాటకంపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ.. జగన్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సైతం కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే.
అసలు ఎప్పుడో వచ్చిన ఈ నాటకాన్ని... ఇప్పుడు రద్దు చేయడం ఏమిటని అటు ప్రజలు.. ఇటు నాటక రంగానికి చెందిన పలువురు నటీనటులు జగన్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అయినా.. ఈ నాటకంలో కొన్ని పాత్రల ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే విధంగా ఉందని... ఆ క్రమంలో సదరు సామాజిక వర్గం.. జగన్ ప్రభుత్వానికి విజ్జప్తి చేయగా.. అందుకు వెంటనే సదరు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నాటకాన్ని నిషేధించాలని గతంలో ఎన్నో ఏళ్లుగా సదరు సామాజిక వర్గం.. గత ప్రభుత్వాలకు వినతులిచ్చి మరీ డిమాండ్ చేస్తోంది. కానీ గత ప్రభుత్వాలు మాత్రం ఈ విషయంలో అంతగా చూసి చూడనట్లు వ్యవహరించాయని.. కానీ జగన్ ప్రభుత్వం.. మాత్రం ఆగమేఘాల మీద కదిలి.. ఈ నాటకంపై నిషేధం విధించడం వెనక పెద్ద తతంగమే నడించిందనే చర్చ అయితే ప్రస్తుతం జోరుగా నడుస్తోంది.
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాలినేని వాసన్న ముఖ్య అనుచరుల్లో ఒకరైన సొమిశెట్టి సుబ్బారావు గుప్తా.. జగన్ పార్టీలో ప్రస్తుతం అంతర్గతంగా చోటు చేసుకోంటున్న అరాచకం.. దీని వల్ల భవిష్యత్తులో పార్టీ కేడర్‌కు ఎదురయ్యే ఇబ్బందులపై పలు కామెంట్స్ చేశారు.
అయితే సుబ్బారావు గుప్తా చేసిన ఈ కామెంట్స్.. జగన్ పార్టీలోని కీలక నేతలకు ఎక్కడో తాకాయి... దాంతో సుబ్బారావు గుప్తాపై దాడి జరగడం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. జగన్ పార్టీలోని కేడర్‌లో ఓ విధమైన అలజడి మొదలైందని సమాచారం. అంతేకాదు తెలుగు ప్రజలు సైతం.. సుబ్బారావు గుప్తాపై దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఆర్య వైశ్య సంఘాలు అయితే.. సుబ్బారావు గుప్తా దాడిని తీవ్రంగా ఖండించడమే కాదు.. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి. అలాగే.. ఈ దాడిపై.. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామంటు ఆర్య వైశ్య నాయకులు సైతం ప్రకటించారు. దీంతో జగన్ పార్టీలోని అగ్రనేతల్లో కొంత ఆందోళన అయితే మొదలైందని.. ఈ నేపథ్యంలో మంత్రి బాలినేని వాసన్న.. రంగంలోకి దిగి.. సుబ్బారావుపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ దాడి చేసిన నిందితులు.. పోలీస్ స్టేషన్‌కు అలా వెళ్లి.. ఇలా స్టేషన్ బెయిల్‌తో బయటకు రావడంతో .. బాధితుడు సుబ్బారావు గుప్తాతోపాటు ఆర్య వైశ్య సంఘాలు సైతం.. జగన్ ప్రభుత్వంపై విమర్శులు ఎక్కుపెట్టాయి.
దీంతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. స్వయంగా రంగంలోకి దిగి.. అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఒంగోలులో అయినా.. లేకుంటే ప్రకాశం జిల్లాలో ఎక్కడ పెట్టమంటే.. అక్కడ తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తానని.. సదరు ఆర్య వైశ్య సంఘం నేతలకు పక్కాగా హామి ఇచ్చారని తెలుస్తోంది.
అయినా సదరు సామాజిక వర్గం.. శాంతించకపోవడంతో.. ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నా.. చింతమణి నాటకంపై నిషేధం విధించే ఏర్పాటు చేయిస్తానని.. మంత్రి బాలినేని వాసన్న.. సదరు సంఘం నేతలుకు స్పష్టమైన హామీ ఇచ్చారని సమాచారం. ఆ క్రమంలోనే.. చింతమణి నాటకంపై జగన్ సర్కార్ నిషేధం ముద్ర వేసిందనే టాక్ అయితే ప్రకాశం జిల్లాలో జోరుగా వైరల్ అవుతోంది. అయితే చింతమణి నాటకంపై నిషేధం విధించడంపై ఇప్పటికే హైకోర్టు.. సీరియస్ అయిన సంగతి తెలిసిందే.


