చివరి రక్తపు బొట్టు వారి కోసమే:బాబు

ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వున్న వాటిని అధిగమించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రైతుల రుణమాఫీ అమలుచేసి వారికి అండగా వుంటామని అన్నారు. నా జీవితంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు పేదవారి కోసం పనిచేస్తానని చెప్పారు. వృద్దులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు పదిహేను వందల రూపాయల పింఛన్ ఇస్తామని అన్నారు. డ్వాక్రా సంఘాలకు కూడా ఈ ఏడాది మార్చి ఆఖరు వరకు రుణాలు ఉన్నవారికి మాపీ చేస్తామని స్పష్టం చేశారు. బెల్టు షాపులను ఇష్టం వచ్చినట్లు పెట్టారని,దీనివల్ల అనేక సమస్యలు వచ్చాయని,వాటిని రద్దు చేయాలని ఆదేశించామని అన్నారు. పోలవరం ముంపు బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని, కొందరు రాజకీయ నాయకులు పోలవరంపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.