మద్యం కేసులో బెయిలు కోసం ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
Published on: Tue Oct 31, 2023 11:20AM
ఒక దాని వెంట ఒకటిగా కేసులు నమోదు చేసి చంద్రబాబును జైలుకు పరిమితం చేయాలన్న వైసీపీ కుట్ర, కక్ష సాధింపు రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయి. స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిలు మంజూరు అవుతుందని ముందే ఊహించిన జగన్ సర్కర్ ఏసీబీ ద్వారా మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూరేలా అక్రమంగా అనుమతులిచ్చారంటూ మరో కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా పేర్కొంది. కాగా దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిలు కోసం ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇలా ఉండగా చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ కొన్ని షరతులు విధించింది. అవి ఎటువంటి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనరాదని హైకోర్టు పేర్కొంది. అలాగే కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదని, ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిలు కనుక ఆసుపత్రికే పరిమితం కావాల్సి ఉంటుందని హైకోర్టు షరతు విధించింది.
అలాగే చంద్రబాబుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ విషయంలో కోర్టు జోక్యం చేసుకోబోదనీ, కేంద్రం నిబంధనల మేరకు ఆయనకు సెక్యూరిటీ అమలు చేయాలని పేర్కొంది. అలాగే మెయిన్ బెయిటు పిటిషన్ పై ఈ నెల 10న వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.


