జిల్లాలకు బాబు.. పాదయాత్రకు చినబాబు.. ఇక జగన్ కు చుక్కలే!
Published on: Tue May 31, 2022 1:53PM
ఒంగోలులో జరిగిన తెలుగుదేశం మహానాడు సూపర్ సక్సెస్ అయింది. టీడీపీ నాయకులు కూడా ఊహించని రీతిలో పార్టీ క్యాడర్ రాష్ట్రం నలు చెరగుల నుంచి సంఖ్యలో హాజరయ్యారు. దీంతో తెలుగుదేశంలో ఫుల్ జోష్ వచ్చేసింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటూ అధినేత చంద్రబాబు దిశా నిర్దేశం చేయడంతో పార్టీలో మరింత ఊపు వచ్చేసింది. టీడీపీ నేతలు, కార్యకర్తల్లో నిండిన ఆ జోష్ ను మరింత పెంచేందుకు, ఎన్నికల దాకా ఆ జోష్ వారిలో అలాగే కొనసాగించేందుకు అటుతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఇటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జనం మధ్యలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలకు రెడీ అవుతున్నారు. ఏపీలో వ్యాప్తంగా ఒక్కో జిల్లాలో మూడేసి రోజుల చొప్పున మకాం వేసి, టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు ఓటర్లతో కూడా చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో చంద్రబాబు జిల్లాల టూర్లకు శ్రీకారం చుడుతున్నారు. కొత్త జిల్లాలు లేదా పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికగా చంద్రబాబు పర్యటనలు ఉంటాయని తెలుస్తోంది. చంద్రబాబు ఒక్కో జిల్లా పర్యటనలో తొలిరోజు మహానాడు పేరుతో విస్తృత స్థాయి పార్టీ సమావేశాలు జరుపుతారు.
రెండో రోజు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ నేతలతో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తారు. మూడో రోజు ఆయా జిల్లాల్లోని ప్రధాన సమస్యలను ఎంపిక చేసుకుని క్షేత్రస్థాయిలో చంద్రబాబు పర్యటిస్తారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం అరాచకాలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంతలా దిగజార్చిందో స్థానిక ప్రజలకు తెలియజెప్పడం, ప్రస్తుతం వైసీపీ ఏలు బడిలో ఏపీ ఎంతలా కుంగిపోతోందో వివరించడం, వైసీపీ ముఖ్య నేత సహా ఆ పార్టీ నేతల దౌర్జన్యాలు, దాష్టీకాలను జనం ముందు కళ్లకు కట్టినట్టు చెప్పేందుకు చంద్రబాబు ముందడుగు వేసేందుకు రెడీ అవుతున్నారు.
మరో పక్కన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. పదేళ్ల క్రితం తన తండ్రి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన పాదయాత్ర స్ఫూర్తితో ప్రజల కష్టసుఖాలు వారి నుంచే వినే సంకల్పంతో ఇప్పడు జనం మధ్యకు వచ్చేందుకు లోకేశ్ నిర్ణయించుకున్నారు. అప్పుడు చంద్రబాబు చేసిన ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపురంలో అక్టోబర్ 2న మొదలై తెలంగాణ మీదుగా కొనసాగి ఏప్రిల్ 27న విశాఖపట్నంలో ముగిసింది. అప్పుడు చంద్రబాబు మొత్తం 2 వేల 817 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.
లోకేశ్ పాదయాత్ర సుమారు ఏడాది పాటు నిరంతరాయంగా కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు. ఒక వేళ ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చినా అందుకు అనుగుణంగా లోకేశ్ పాదయాత్రలో మార్పులు చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. తండ్రి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించిన అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజునే తాను కూడా పాదయాత్ర ప్రారంభించేందుకు లోకేశ్ నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
జగన్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లడం, టీడీపీ శ్రేణుల్లో ఉరకలెత్తే ఉత్తేజాన్ని నింపండం లోకేశ్ పాదయాత్ర లక్ష్యంగా చెబుతున్నారు. ఏపీలో అన్ని ప్రాంతాలనూ లోకేశ్ పాదయాత్ర టచ్ చేసేలా రూట్ మ్యాప్ రెడీ అవుతోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి వచ్చే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున లోకేశ్ పాదయాత్ర ప్రారంభం అవుతుందని అంటున్నారు. అయితే.. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న అవాంఛనీయ పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ ముందుగానే ఎన్నికల్లో వచ్చేటట్టయితే.. మరింత ముందే లోకేశ్ పాదయాత్ర మొదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


