క్రికెట్,రాజకీయం పూర్తిగా విరుద్ధమైనవి

పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ సారధ్యంలోని పీటీఐ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. మెజారిటీకి కొద్ది దూరంలో నిలిన పీటీఐ పార్టీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే యోచనలో ఉంది.ఇమ్రాన్ ఖాన్‌కు టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ నేపథ్యంలో అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ‘‘పాకిస్తాన్ జట్టు కెప్టెన్‌‌గా ఉన్నప్పుడు మైదానంలో ఆయన చాలా సానుకూలంగా, ధైర్యంగా, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేవాడు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడితే అదే పంథాను ఇప్పుడు కూడా కొనసాగించాలి’’ అని సూచించాడు.

 

 

క్రికెట్ జట్టును నడిపించడం, దేశాన్ని నడిపించడం ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధమని,ముందు ముందు ఎలాంటి ఫలితాలు ఉంటాయో వేచిచూడాలని ఆయన పేర్కొన్నారు.ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావడం వల్ల భారత్, పాక్ సంబంధాల్లో సానుకూలత వచ్చే అవకాశాలున్నాయా అన్నప్రశ్నకు స్పందిస్తూ... ఇరు దేశాల మధ్య వైరం తగ్గాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘‘అన్నిటికంటే ముందు ఆయన దేశంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. తొలుత ఇమ్రాన్ వాటిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. ఆ తర్వాతే ఆయన ఇతర సమస్యల వైపు దృష్టిపెట్టగలరు’’ అని అజార్ పేర్కొన్నాడు.ఓ క్రికెటర్ తన దేశానికి ప్రధానికావడం పట్ల సంతోషంగా ఉందన్నారు. మైదానంలో మాదిరిగానే ఇమ్రాన్ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇమ్రాన్ ముందున్నది పూలబాటకాదనీ,ఆయన పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు.