ఏసీబీకి చేరిన బెంజ్ వ్యవహారం.. ఆధారాలు చూపినా మంత్రిపై చర్యలు తీసుకోరా?

ఇటీవల ఏపీ రాజకీయాల్లో బెంజ్ కారు లంచం వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కార్మిక శాఖ మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్ కి ఈఎస్ఐ స్కాంలో ఏ14 గా ఉన్న కార్తీక్ ఖరీదైన బెంజ్ కారుని గిఫ్ట్ గా ఇచ్చారని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అయితే, ఆ కారు తన కుమారుడుది కాదని, కేవలం కారు కీస్ అందిస్తూ ఫోటో మాత్రమే దిగాడని మంత్రి జయరాం చెప్పుకొచ్చారు. కానీ, ఆయన కుమారుడు పలు సందర్భాల్లో ఆ కారులో చక్కర్లు కొట్టిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో మంత్రి సైలెంట్ అయ్యారు.

 

ఇదిలా ఉంటే, తాజాగా మంత్రి జయరాంపై చర్యలు తీసుకోవాలని ఏసీబీకి ఆధారాలతో మంత్రి అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేశారు. గురువారం టీడీపీ నేతలతో కలిసి అయ్యన్న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయ్యన్న మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి జయరాం, జగన్ సర్కార్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి జయరాం తనయుడు ఈశ్వర్ అవినీతిపై తాను ఆధారాలతో బయట పెట్టానన్నారు. ఒక వ్యాపారస్తుడు అంత ఖరీదైన కారు ఎందుకు బహుమతి ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈఎస్ఐ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తితో మంత్రి, ఆయన తనయుడు ఫోటో ఎందుకు దిగారని ప్రశ్నించారు.

 

రాష్ట్రం లో అవినీతి జరిగితే క్షమించనన్న ముఖ్యమంత్రి ఇప్పుడేమయ్యారు అని ప్రశ్నించారు. అవినీతిపై ఫిర్యాదు చేయడానికి ఫోన్ నంబర్లు ఇచ్చారు. ఇదివరకే నేను కాల్ సెంటర్‌కి ఫోన్ చేసి పిర్యాదు చేశాను కానీ ఇంతవరకు స్పందన లేదని విమర్శించారు. ఈఎస్ఐ కేసులో మంత్రి అవినీతి చేశారని ఆధారాలు చూపించినా ఎందుకు స్పందించడం లేదు? అని నిలదీశారు. ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవలసింది పోయి మంత్రిని కాపాడాలని చూస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడుని ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్టు చేశారు. మేము అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు చూపిస్తే మాత్రం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని విరుచుకుపడ్డారు. మంత్రి జయరాంని వెంటనే మంత్రి పదవి నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు. ఏసీబీపై మాకు నమ్మకం ఉంది. ఒకవేళ ఏసీబీ వద్ద న్యాయం జరగకపోతే గవర్నర్‌ను కలుస్తాం అని అయ్యన్న స్పష్టం చేశారు.