TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆనందయ్య మందుతో హానీ లేదు.. ఆయుష్ శాఖ క్లారిటీ

Published on: Sun May 23, 2021 8:59AM

కరోనాకు కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న మందు తయారీలో హానికర పదార్థాలు లేవని ఆయుష్ శాఖ కమిషనర్ రాములు చెప్పారు. కళ్లలో వేసే డ్రాప్స్‌లో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారని స్పష్టం చేశారు. అయితే ఆనందయ్య మందు రోగులపై పనిచేస్తుందా లేదా అనేది ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుందని రాములు వెల్లడించారు. డాక్టర్ల బృందం పరిశీలన అనంతరం తమ నివేదికను సీసీఆర్ఎఎస్‌‌కు పంపుతుందున్నారు. అన్ని నివేదికలు వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం వస్తుందని రాములు వెల్లడించారు. 

ఆనందయ్య ఇస్తున్నది ఆయుర్వేద మందు కాదని, అది నాటువైద్యమని రాష్ట్ర ఆయుష్ శాఖ తెలిపింది. దీనిని వాడాలా? వద్దా? అనేది వ్యక్తిగత ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. కమిషనర్ కర్నల్ రాములు నేతృత్వంలో రెండు రోజులపాటు కృష్ణపట్నంలో పర్యటించిన వైద్యబృందం ఆనందయ్య మందును పరిశీలించింది. అక్కడికి వెళ్లడానికి ముందే ఆనందయ్య కరోనా మందుకు హైదరాబాద్‌లోని ల్యాబ్‌లో పరీక్షలు చేయించారు. ఆ ఫలితాలు, ఆనందయ్య ఇచ్చిన వివరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఆనందయ్య ఇచ్చేది నాటు మందుగా గుర్తించినట్టు రాములు తెలిపారు.

ఆనందయ్య ఇచ్చే మందులో పచ్చకర్పూరం, పసుపు, నల్ల జీలకర్ర, వేప చిగురు, మారేడు చిగురు, ఫిరంగి చెక్క, దేవరబంగి వంటి ముడి పదార్థాలు ఉన్నట్టు ఆయుష్ అధికారులు గుర్తించారు. దీంతోపాటు ముళ్ల వంకాయ, తోకమిరియాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని చుక్కల మందు రూపంలో కంట్లో వేస్తున్నారు. కాగా, తన పరిశీలనలో ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదని రాములు తెలిపారు.  ఆనందయ్య మందును పరిశీలించేందుకు ఐసీఎంఆర్ బృందం నెల్లూరుకు వస్తుందన్న వార్తల్లో నిజం లేదని అధికారులు చెప్పారు.