TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అయోధ్య ట్రస్ట్‌లో అవినీతి?.. రాజకీయ ప్రయోజనాల కోసమే నిధుల మళ్లింపా!

Published on: Tue Jun 30, 2026 8:26PM

 

అయోధ్య రామాలయం, విరాళాల వివాదం, రాముడి నిధుల దుర్వినియోగం, సిట్ విచారణ, యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని ప్రతిష్టాత్మక రామమందిర నిర్మాణ విరాళాల సేకరణలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రామభక్తులు ఎంతో నమ్మకంతో సమర్పించిన కానుకలు, విరాళాలు దుర్వినియోగం అయ్యాయనే వార్తలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఈ వివాదంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పలు అంశాలపై జర్నలిస్ట్ గోపి మరో సీనియర్  జర్నలిస్ట్ భరద్వాజ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది

ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న బంగారం, నగదు, ఇతర విలువైన కానుకలకు సరైన రికార్డులు కానీ, రశీదులు కానీ నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు. తిరుమల వంటి ప్రముఖ క్షేత్రాల్లో ప్రతిరోజూ పారదర్శకంగా ఆడిటింగ్ జరుగుతుందని, కానీ అయోధ్య ట్రస్ట్‌లో అటువంటి యంత్రాంగం లేకపోవడమే ఈ అవినీతికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, అధికార పక్షానికి చెందిన ఒక ఎంపీ కూడా ఈ నిధుల దుర్వినియోగంపై సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా వేడిని పెంచింది. ట్రస్ట్‌లో లూజ్ మెకానిజం ఉండటం వల్లే నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉందని, ఇందులో చాలా పెద్ద తలకాయల ప్రమేయం కూడా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్‌తో పాటు మరో ముఖ్య ప్రతినిధి శుక్లాను పదవుల నుంచి తప్పుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. దీనితో వారు తమ పదవులకు రాజీనామా చేయగా, ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సిట్ అధికారులు జరిపిన సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ట్రస్ట్‌లోని కొందరు ఉద్యోగుల ఇళ్లపై జరిగిన దాడుల్లో భారీగా నగదు లభ్యమైంది. 

గతంలో అద్దె ఇళ్లలో నివసించిన సాధారణ ఉద్యోగులు సైతం, ట్రస్ట్ కార్యక్రమాల్లో చేరిన అతి తక్కువ కాలంలోనే పది కోట్ల రూపాయల విలువైన బంగ్లాలు, భారీ ఆస్తులను ఎలా సంపాదించారనే కోణంలో అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.ఈ వ్యవహారంపై తెలంగాణకు చెందిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన అంశం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిధులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మతాన్ని రాజకీయాల కోసం వాడుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. అయితే తాము ఎలాంటి విమర్శలకు వెనకాడబోమని, దర్యాప్తులో నిజా నిజాలు తేలేవరకు నిందితులు జైల్లోనే ఉంటారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. భక్తుల కష్టార్జితమైన ప్రతి రూపాయికి పూర్తి జవాబుదారీతనం ఉండాలని, ట్రస్ట్ ప్రారంభమైన తొలి రోజు నుంచి ఇప్పటివరకు వచ్చిన నిధులపై సమగ్ర పబ్లిక్ ఆడిటింగ్ నిర్వహించాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. భవిష్యత్తులో నూతన బోర్డు ఏర్పాటుతోనైనా పారదర్శకత వస్తుందా లేదా అనేది సిట్ నివేదిక తర్వాతే తేలనుంది. అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించవచ్చు.