రామ మందిర రాజకీయం మళ్లీ రాజుకుంటోంది!

ఓవైసీ అయోధ్య రామ మందిరం వివాదం పై మళ్లీ నోరు విప్పాడు. ఆ కేసులో తీర్పు ఇవ్వాల్సింది సుప్రీమ్ కోర్టు అన్నాడు. అమిత్ షా కాదంటూ సెటైర్లు వేశాడు. అంతే కాదు, ఎన్నికల ముందు రాబోతోన్న అయోధ్య తీర్పు పారదర్శకంగా వుండాలని పేర్కొన్నాడు. ఇలా హఠాత్తుగా ట్విట్టర్ లో అయోధ్య గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింధి?

 

 

అసదుద్దీన్ ఓవైసీ ఆందోళనకి కారణం అమిత్ షా! ఆయన హైద్రాబాద్ వచ్చిన సందర్భంగా బీజేపీ నాయకులతో, ఆరెస్సెస్, వీహెచ్పీ నేతలతో మాట్లాడారు. మీడియాకు నేరుగా వివరాలేవీ తెలియజేయనప్పటికీ … ఆయన రామ మందిరం గురించి మాట్లాడారని మ్యాటర్ లీకైంది. 2019 ఎన్నికల లోపే అయోధ్యలో రామ మందిరం సాకారం అవుతుందని షా అన్నారట. ఇది ఎలా బయటకు వచ్చిందోగానీ జాతీయ మీడియాలో కూడా కలకలం రేపింది. కోర్టులో వున్న విషయంపై బీజేపీ అధ్యక్షుడు అయ్యి వుండి అమిత్ షా అలా ఎలా మాట్లాడతారని నిరసనలు మొదలయ్యాయి. ఓవైసీ ట్విట్టర్ వ్యాఖ్యలకు ఇదే కారణం!

ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ అన్ని పార్టీలు తమ తమ బలాల్నీ, బలహీనతల్ని మథింపు చేసుకుంటాయి. బీజేపీకి ఖచ్చితంగా రామ మందిరం పెద్ద బలం. బలహీనత కూడా! మోదీ ప్రస్తుతం స్వంత మెజార్టీతో ప్రధానిగా వున్నారు. ఆయన వాజ్ పేయ్ లా పొత్తుల వల్ల మందిరం కట్టలేకపోయానని చెప్పలేరు. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ కాషాయదళం రామ మందిరానికి పునాదులు వేశాకే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. సుప్రీమ్ లో కేసు విచారణ జరుగుతున్న వేగం కూడా ఆ దిశగానే వుంది. కోర్టు తీర్పు ఎలా చూసినా ఎన్నికల లోపే వచ్చేస్తుంది. అయితే, తీర్పు ఏంటన్నది ఎవ్వరం చెప్పలేం. కానీ, షా తనకు ఇప్పటికే తెలుసునన్నట్టు నాయకులకి, కార్యకర్తలకి మందిరం కట్టేస్తామని చెప్పటం వివాదాస్పదం అవుతోంది.

 

 

కోర్టులో వున్న వ్యవహారంపై తాను వ్యాఖ్యలు చేయకూడదని అమిత్ షాకి తెలియదనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. ఒకవేళ ఆయన తెలిసే మాట్లాడి వుంటే… ముందు ముందు మరోమారు రామ జన్మభూమి రాజకీయాలకు కీలకం అవ్వనుందని భావించవచ్చు. ఓవైసీ లాంటి వాళ్లు అప్పుడే పాదర్శకం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారంటే… తీర్పు ఎలా వచ్చినా గందరగోళం తప్పకపోవచ్చు. అలాగే, ఉత్తర్ ప్రదేశ్ లోని షియా ముస్లిమ్ నాయకులు కూడా రామ మందిర నిర్మాణానికి బీజేపీ డైరెక్షన్లో అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా మొత్తం మీద రామ మందిర అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య పెద్ద రచ్చే జరగవచ్చు రానున్న ఎన్నికల సీజన్లో! ఖచ్చితంగా 2014లో లాగా అభివృద్ధి, అవినీతి వంటి విషయాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మరి ఇదంతా చివరాఖరుకు ఎవరికి లాభిస్తుంది? ప్రస్తుతానికి రాముడికే తెలియాలి! ఎన్నికల ఫలితాల నాడు మాత్రమే మనకు తెలుస్తుంది!