ఆయేషామీరా హత్య కేసులో ట్విస్ట్
Published on: Fri Sep 12, 2025 4:22PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తును పూర్తి చేసిన సీబీఐ ఆయేషామీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొంది. నిర్దోషిగా విడుదలైన సత్యంబాబుపై 376, 302 సెక్షన్లు నమోదు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని పేర్కొంది.
17 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని , ఇంకా విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారని, బాధితులైన తాము ఎన్నిసార్లు కోర్టుకు తిరగాలని తల్లి శంషాద్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఓ హాస్టల్‌లో 17 ఏళ్ల అయేషా మీరా అనే ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన 2007 డిసెంబర్27వ తేదీన జరిగింది. తాను ఉంటున్న హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో కత్తిపోట్లతో ఆయేషా మీరా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన సంచలనంగా మారింది. కాగా ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.


