నా బిడ్డ విషయంలో ఈ న్యాయం ఏమైంది?: అయేషా మీరా తల్లి షంషాద్ బేగం

 

దిశ హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ పై అయేషా మీరా తల్లి షంషాద్ బేగం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిశ హత్య కేసు నిందితులు పది రోజుల్లోనే హతమవ్వడంపై ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం ఆనందం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరైనా శిక్ష పడాల్సిందేనని, నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని అన్నారు. ఎన్ కౌంటర్ వల్ల దిశకు కొంత న్యాయం జరిగినట్లేనని ఆమె అన్నారు.


అయేషా మీరా కేసులో సజ్జనార్ లాంటి అధికారి ఉంటే తమకు ఏనాడో న్యాయం జరిగేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిశపై అఘాయిత్యానికి పాల్పడి అన్యాయం చేసిన వారు సామాన్యులు, ఎటువంటి రాజకీయ అండదండలు లేవు కాబట్టి ఈజీగా వారిని కాల్చిచంపేశారని, అదే తన కుమార్తె విషయంలో ఇప్పటికీ ఎందుకు న్యాయం జరగడం లేదని అయేషా మీరా తల్లి శంషాద్ బేగం ప్రశ్నించారు. 

విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీలో ఫార్మసీ కోర్సు చేస్తూ లేడీస్ హాస్టల్ లో ఉంటున్న 19 ఏళ్ళ ఆయేషా మీరాను 27 డిసెంబరు 2007 న అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే.  బాత్ రూంలో మృతదేహం పడివుండగా, 'తన ప్రేమను తిరస్కరించినందుకే ఆమెపై అత్యాచారంచేసి చంపేశాను' అని నిందితుడు లెటర్ రాసి మరీ ఆమె పక్కన పడేశాడు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులు పలుకుబడి కలిగిన వారు కావడంతో ఆధారాలు దొరక్కుండ చేసి కేసును తారుమారు చేశారు. చివరకు ఓ చిల్లర దొంగ సత్యంబాబును కేసులో నిందితుడిగా చూపి శిక్ష పడేలా చేశారు పోలీసులు. 

కేసు విచారణలో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో కేసు దర్యాప్తు మళ్లీ మొదటికొచ్చింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులు ఎవరు అనేది ఇంకా తెలియని పరిస్థితి. 11 ఏళ్ల తర్వాత ఈకేసును ప్రస్తుతం సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.