TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

15 ఏళ్లుగా తేలని ఆయేషా మీరా హత్య కేసు

Published on: Fri May 5, 2023 9:54AM

అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్యకేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. 2007లో జరిగిన ఈ హత్యకేసులో అభియోగాలు ఎదుర్కొని నిర్దోషిగా విడుదలైన సత్యంబాబును అరెస్ట్ చేయాల్సిన కారణాల గురించి ఆరా తీస్తోంది. ఈక్రమంలోనే హైదరాబాద్ నగర కమిషనరేట్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ కమిషనర్ శ్రీనివాసులు నుంచి సీబీఐ అధికారులు గురువారం పలు వివరాలు సేకరించారు.

మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలోకి వెళ్లిన శ్రీనివాసులు రాత్రి 8 గంటలకు బయటికి వచ్చారు. ఆయన నుంచి 8 గంటలపాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని దుర్గా లేడీస్ హాస్టల్లో ఆయేషామీరా హత్య జరిగిన సమయంలోనే నందిగామ పరిసరాల్లో మరిన్ని నేరాలు నమోదయ్యాయి. ఆ సమయంలో శ్రీనివాసులు నందిగామ డీఎస్పీగా ఉన్నారు. నందిగామ ప్రాంతంలో జరిగిన వరుస నేరాలను దర్యాప్తు చేసేందుకు అప్పటి తూర్పుగోదావరిజిల్లా అదనపు ఎస్పీగా ఉన్న ఎ.వి.రంగనాథ్(వరంగల్ ప్రస్తుత కమిషనర్)ను అక్కడికి పంపించారు.

దర్యాప్తులో భాగంగా అప్పటికే మరో కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సత్యంబాబును విచారించి.. ఆయేషామీరా హత్య కేసుతో సంబంధమున్నట్లు పోలీసులు భావించి అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారాల్ని శ్రీనివాసులు సైతం పర్యవేక్షించారు. అయితే ఆయేషామీరా హత్యకేసులో సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేసిన నేపథ్యంలో హత్య ఎవరు చేశారని తేల్చేందుకు సీబీఐ మరోసారి దర్యాప్తు ఆరంభించింది. ఇందులో భాగంగానే అప్పటి కేసుకు సంబంధించి శ్రీనివాసులు నుంచి సీబీఐ అధికారులు వాంగ్మూలం సేకరించారు.

ఘటన సందర్భంలో.. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడి పేరు అప్పట్లో వార్తల్లోకి ఎక్కింది. రాజకీయ వత్తిడి కారణంగా అతని పేరు..ఆ తర్వాత అటకా ఎక్కిందన్న ఆరోపణలు ఉన్నాయి. కూతురిని పోగొట్టుకున్న అయేషా తల్లిదండ్రులు దాదాపు 15 ఏళ్లుగా కడుపు కోతను అనుభవిస్తూ కూడా న్యాయం కోసం పోరాడుతున్నారు.