అయ్యన్నపాత్రుడు.. విజయసాయి ట్విట్టర్ వార్
Published on: Sat Jun 25, 2022 11:35AM
తెలుగుదేశం సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ విధానాలను విమర్శించడంలోనూ, జగన్, విజయసాయి దుర్మార్గాలను ఎండగట్టడంలోనూ అందరి కంటే ముందు వరుసలో నిలుస్తారన్న సంగతి తెలిసిందే.
ఆ కారణంగానే అధికార పార్టీ ఎప్పుడు అవకాశం దొరికినా అయ్యన్న పాత్రుడిపై విమర్శల దాడులకు రెడీగా ఉంటారు. ప్రభుత్వమైతే ఏదో విధంగా ఆయనను ఇరుకున పెట్టి కటకటాల వెనక్కు పంపించే యత్నాలను, మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి ఆస్తులపై అధికారులతో దాడులను చేయిస్తుంటుంది. సందట్లో సడేమియా అన్నట్లుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్లర్ వేదికగా అనుచిత పదజాలంతో అయ్యన్న పాత్రుడిని రెచ్చగొట్టే యత్నాలు చేస్తూనే ఉంటారు. పులి, పిల్లి అంటే విజయసాయి తాజాగా చేసిన ట్వీట్ కు అయ్యన్న పాత్రుడు అదే స్టైల్ లో అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి.. తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి మధ్య ట్విట్టర్ వేదికగా వార్ కొనసాగుతోంది. విజయసాయిరెడ్డి ఈ ఉదయం ట్విట్టర్ లో పెట్టిన పోస్టుపై అయ్యన్నపాత్రుడు ఆయనకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. 16 నెలలు చిప్పకూడు తినడం వలన చర్మం మందమైంది. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయసాయి రెడ్డి పులిగా ఫీల్ అవుతున్నాడు. బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉంది. అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ. నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెడీ. అన్నట్లు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్ గా రావాలి. అప్పుడు తేలిపోద్ది ఎవడు పులో ఎవడు పిల్లో!’ అంటూ అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
అంతకు ముందు.. ‘పిల్లి తనను ఎవరు వేటాడతారా అని ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది. కానీ పులి కన్నా గొప్పదాన్నని తనకు తానే అనుకుంటుంది. నేను నర్సీపట్నం వస్తా. డేట్, టైం చెప్పు తాగుబోతు. అయినా నువ్వు అజ్ఞాతంలోకి పోయావట కదా! పారిపోకుండా నిలబడు గంజాయి’ అంటూ అయ్యన్న పాత్రుడిపై ట్విట్టర్ ఖాతాలో విజయసాయి వ్యాఖ్యలు పోస్టు చేశారు. దీంతో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరినట్లయింది. అర్థరాత్రి అధికారులు మందీ మార్బలంతో నివాసాలు కూల్చడానికి రావడం వెనుక ఉన్న మర్మమేమిటో వీరిరువురి ట్వీట్ వార్ తో జనానికి దాదాపుగా అర్ధమైపోయింది. కోర్టు కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే ఎవరు రుజువర్తనతో ఉన్నారు, ఎవరు అవకాశవాదంతో ముందు వెనుకలాడుతున్నారన్నదీ తేటతెల్లమైపోయింది.


