'అవనీర్' మీటర్ల కొను 'గోల్‌మాల్'పై.. విజిలెన్స్ నివేదికకు విలువేదీ?

విద్యుత్ మీటర్ల కొనుగోలులో 41 కోట్లు వృధా


ఆ 12 మంది నుంచి రికవరీ చేయమని ఇంధన కార్యదర్శి ఆదేశం


‘షో’కాజులతో  మీనమేషాలు లెక్కబెడుతున్న ఎస్పీడీసీఎల్ సీఎండీ

టీడీపీ హయాం నాటి అవినీతిపై చర్యలేవీ?

 

తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ  అవినీతి జరిగిందోనని వైసీపీ సర్కారు భూతద్దంతో అన్వేషిస్తోంది. ఆ లెక్కల కోసం తాపత్రయపడుతోంది. సీఐడి నోటీసులిస్తోంది. కానీ టీడీపీ జమానాలోనే 41 కోట్ల రూపాయలు, ఖరీదైన విద్యుత్ మీటర్ల కొనుగోలుపై గోల్‌మాల్ జరిగిందని, స్వయంగా ఇంధన శాఖ, విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. అయితే వైసీపీ సర్కారు ఆ నివేదికను అమలు చేయడం చేతకాక, చేతులెత్తేసింది. పైగా ఎవరినయితే దోషులుగా తేల్చి.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, వారి నుంచి అంత సొమ్మునూ రికవరీ చేయాలని సిఫార్సు చేసిందో..  దానిని అమలుచేయకుండా, వారికి సంజాయిషీ నోటీసులిచ్చి కాలయాపన చేస్తోంది. ఫలితంగా.. ఎస్పీడీసీఎల్ సీఎండీ వ్యవహార శైలి, సహజంగానే అనేక అనుమానాలకు తావిస్తోంది. చివరకు ఆదేశాల్చిన ఇంధన శాఖ కార్యదర్శి, విజిలెన్స్ ఆదేశం- నివేదికకూ, పూచికపుల్ల పాటి విలువ కూడా లేకుండా పోయింది. ఇదీ ఏపీ ఎస్పీడీసీఎల్ వైచిత్రి.

 

ఎలాంటి ఆధారాలు లేని అమరావతి భూములలో.. లొసుగుల కోసం తెగ చెమటోడ్చి పనిచేస్తున్న జగన్మోహన్‌రెడ్డి సర్కారు.. 41 కోట్ల రూపాయల  విద్యుత్ మీటర్ల కోట్ల కొనుగోలు వ్యవహారంలో, అన్ని ఆధారాలతో స్వయంగా ప్రభుత్వ అధికారులే నివేదిక ఇచ్చినా.. ఇప్పటివరకూ దానిపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కబెడుతున్న వైనం విస్మయపరుస్తోంది. దీనికి సంబంధించి 12 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుని, రెవిన్యూ రికవరీ యాక్టు ప్రకారం ఆ సొమ్మును వారి నుంచే రికవరీ చేయాలని స్వయంగా ఇంధనశాఖ కార్యదర్శి, విజిలెన్స్ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా, బుట్టదాఖలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం మారినప్పటికీ,  ఈ వ్యవహారంలో ఎంతమంది పెద్దల పలుకుబడి- ప్రభావం ఇంకా ఎంత బలంగా పనిచేస్తోందో స్పష్టమవుతోంది.

 

నాటి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కథ ఇది. అంటే 30-11-2005లో అన్నమాట. అవనీర్ పవర్ టెక్నాలజీ కంపెనీ నుంచి విద్యుత్ మీటర్లను భారీ సంఖ్యలో, అప్పటి టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది.  ఎస్పీడీసీఎల్ చైర్మన్-ఎండీగా గోపాల్‌రెడ్డి ఉన్నారు. ఆ మేరకు అవనీర్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  అయితే, సదరు కంపెనీ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ మీటర్లలో, చాలావరకూ నాసిరకం-నాణ్యత లేనివే ఎక్కువ ఉన్నాయని, పైగా కంపెనీ గ్యారంటీ ఇచ్చిన గడవులోగానే మొత్తం సొమ్ము కంపెనీకి చెల్లించడంతో, ప్రభుత్వానికి 41 కోట్ల 46 లక్షల నష్టం వచ్చిందని విజిలెన్స్ అధికారులు తన నివేదికలో పేర్కొన్నారు.

ఆ ప్రకారంగా అప్పట్లో ఈ వ్యవహారంలో బాధ్యులుగా ఉన్న సీఎండీ కె.రంగనాధ్, చైర్మన్‌గా ఉన్న పి.గోపాల్‌రెడ్డితోపాటు, వివిధ స్థాయిలో ఉన్న కె.పి. ఆనంద్, దామోదర్‌రావు, కె.ప్రకాష్, ఏ.చిన్నయ్య, టి.హన్మంత ప్రసాద్, ఆర్. శ్రీనివాసులు, వై.లక్ష్మీనరసయ్య, మిక్కిలి విజయకుమార్, బి.సుబ్రమణ్యం, ఏ.వేణుగోపాల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, వారి నుంచి ప్రభుత్వం నష్టపోయిన 41 కోట్ల 46 లక్షల రూపాయలను ఏపి రెవిన్యూ రికవరీ యాక్టు 1864 ప్రకారం వారి నుంచి వసూలు చేయాలని, ఇంధనశాఖ కార్యదర్శి 11-9-2020న ఎస్పీడీసీఎల్ సీఎండీ-చైర్మన్‌కు ఆదేశాలు జారీ చేశారు.

 

సహజంగా కొనుగోలు చేసిన కంపెనీ తమ వస్తువులపై, మూడు నుంచి- ఐదేళ్ల వరకూ గ్యారంటీ ఇస్తుంది. ఆ ప్రకారంగానే విద్యుత్ శాఖ వారికి పేమెంట్లు ఇస్తుంటుంది. ఒకేసారి సొమ్ము చెల్లిస్తే, ఇక కంపెనీ తన బాధ్యత నుంచి తప్పించుకుంటుందన్న ముందుచూపుతోనే, పేమెంట్లు విడతల వారీగా చెల్లిస్తారు. కానీ, సదరు అవనీర్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా, ఒకేసారి బిల్లు చెల్లించేయడంపై శాంతికిరణ్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కాగా శాంతికిరణ్ అనే వ్యక్తి, గత టీడీపీ ప్రభుత్వంలో  విద్యుత్ మీటర్ల కోనుగోలులో అవినీతి జరిగిందని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి, ఆ వ్యవహారంలో 41 కోట్ల 46 లక్షల రూపాయలు ప్రభుత్వం నష్టపోయిందని నివేదిక ఇచ్చారు. దానితో సదరు మాజీ అధికారులంతా, ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, కోర్టు దానిని తిరస్కరించింది. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మందిలో కొందరు పదవీ విమరణ చేయగా, మరికొందరు చనిపోయారు. ప్రస్తుతం సీజీఎమ్ హనుమత్ ప్రసాద్, పే ఆఫీసర్ లక్ష్మీనరసయ్య, జీఎం విజయ్‌కుమార్ మాత్రం ఇంకా సర్వీసులో కొనసాగుతున్నారు. అంటే.. శాంతికిరణ్ అనే వ్యక్తి, ఒకవేళ హైకోర్టును ఆశ్రయించకపోతే, ఈ 41 కోట్ల వ్యవహారం విజయవంతంగా సమాధి అయిపోయేదని స్పష్టమవుతోంది. మరి కోర్టుదాకా వెళ్లి, విజిలెన్స్ -ఇంధన కార్యదర్శి ఆదేశాలిచ్చిన ఈ వ్యవహారంపై మామూలుగా అయితే.. చర్యలు పంచకల్యాణి గుర్రంలా, శరవేగంగా ఉండాలి. ఇంధన శాఖ కార్యదర్శి అంటే సీఎండీ-చైర్మన్‌కు బాస్. అంటే కార్యదర్శి ఆదేశం, శిలాశాసనమన్నమాట. పైగా విజిలెన్స్ కూడా నివేదిక  ఇచ్చింది. మరి ఎస్పీడీసీఎల్ సీఎండీ ఇప్పటిదాకా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?  క్రిమినల్‌కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు? వారి నుంచి ఆ 41 కోట్ల రూపాయలు ఎందుకు రికవరీ చేయడం లేదన్న ప్రశ్నలు, మెదడున్న ఎవరికయినా రావడం సహజం. మామూలు పామరులకే ఇన్ని సందేహాలు వచ్చినప్పుడు, పాలకులకు ఇప్పటిదాకా రాకపోవడమే విడ్డూరం. విస్మయకరం కూడా.

 

సదరు అవనీర్ కంపెనీ సరఫరా చేసిన విద్యుత్ మీటర్లకు సంబంధించి.. పర్చేజ్ ఆర్డర్ నెంబర్ 16/2003-2004 డేటెడ్ 24-5-2003న, అవనీర్ సరఫరా చేసిన ఎనర్జీ మీటర్లలో 92.80 శాతం  పనికిరాకుండా పోయాయని, విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. పి.ఓ నెంబర్ 72/2004-2005 డేటెడ్  3-6-2004న సరఫరా చేసిన వాటిలో,  71.75శాతం మీటర్లు పనికిరాకుండా పోయాయని వెల్లడించింది. పి.ఓ నెంబర్ 317/2004-2005 డేటెడ్  1-1-2005న సరఫరా చేసిన వాటిలో, 72.25 శాతం మీటర్లు పనికిరాకుండా/నాణ్యత లేవని  తేలిందని విజిలెన్స్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది.

 

మరి ఇంత విస్పష్టంగా విజిలెన్స్ నిర్ధారించి, నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎస్పీడీసీఎల్ సీఎండి హరనాధరావు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుని, సొమ్ము రికవరీ చేయకుండా తాత్సారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంధన శాఖ కార్యదర్శి ఆదేశాలకు భిన్నంగా.. వారికి  షోకాజులిచ్చి, వివరణ కోరడంపై మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. అంటే బాధ్యులకు మరింత గడువు ఇచ్చినట్లేనన్న వ్యాఖ్యలు విద్యుత్ శాఖ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాధరావును ‘సూర్య’ వివరణ కోరింది. దానికి ఆయన.. వారికి షోకాజు నోటీసులిచ్చామని, దానిని చూసిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘ఏకంగా వారిపై చర్యలు తీసుకుంటే రేపు కోర్టుకు వెళితే ఇబ్బందవుతుంది. ఇప్పటి పరిస్థితి మీరు చూస్తున్నారు కదా. అందుకే ప్రొసీజరు ఫాలో అవుతున్నాం’ అని వ్యాఖ్యానించారు.

 

కాగా, కడపకు చెందిన ఓ ఎలక్ట్రికల్ కంపెనీ యజమాని.. ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఆశీస్సులతోనే ఇప్పటి అధికారి అత్యున్నత హోదా సాధించారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు, సదరు కడప కంపెనీ యజమాని ద్వారా లాబీయింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజం ‘జగన్నాధుడి’కి ఎరుక!  అవినీతిని సహించేది లేదని ఇప్పటికి కొన్ని డజన్ల సార్లు చెప్పిన సీఎం జగన్మోహన్‌రెడ్డి, కరెంట్ మీటర్ల కొనుగోలులో.. 41 కోట్ల మేర గోల్‌మాల్ జరిగినా ఇంకా మౌనవ్రతం పాటించడమే ఆశ్చర్యం.

 

ఆయనది కడప. ఆయనకో పెద్ద ఎలక్ట్రికల్ కంపెనీ ఉంది. సర్కారుకు పరికరాలు కొనుగోలు చేయడంలో దానికదే సాటి. ఆర్డర్లు పట్టేయడంలో ఆరితేరింది. ఇప్పుడు పాలకులకూ ఆ కంపెనీ చాలా దగ్గర. అలాంటి కంపెనీపై సర్కారు, కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది. కానీ, దయగల ప్రభువులు.. దానిని రద్దు చేసి, సదరు కంపెనీనిని కరుణించారు.

-మార్తి సుబ్రహ్మణ్యం