ఆటోవాలాలు కాదు యమకింకరులు..!
Published on: Wed Oct 5, 2016 7:35PM

ఇదివరకటి రోజుల్లో తమ పిల్లలను పొద్దున్నే తయారు చేసుకుని ద్విచక్ర వావానాల మీదనో..లేదంటే నడుచుకుంటూనో వెళ్లి వారిని ఉదయం పాఠశాల వద్ద దించి సాయంత్రం తీసుకుని వచ్చేవారు . కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సెకను కాలం కూడా ఎంతో అమూల్యమైనదిగా భావించడంతో తల్లిదండ్రులు తమ బాధ్యతను ఆటోవాలాల మీద పెడుతున్నారు. ఎంతైనా తల్లిదండ్రులు..తల్లిదండ్రులే. బయటివారు బయటివారే. అంతటి బాధ్యతను మోస్తున్న ఆటోవాలాలు అసలు ఏ మాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
లాభాపేక్ష కోసం పరిమితికి మించి ఆటోల్లో విద్యార్థులను తరలిస్తున్నారు. ఏ మాత్రం పట్టు తప్పినా..అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. ఇదొక్కటే కాదు ఆటోవాలాలు భద్రతా పరమైన ఏ నిబంధనను పాటించడం లేదు. దీంతో చిన్నారులకు ఆటో ప్రయాణం ప్రాణగండంగా మారింది. తాజాగా పోలీసుల పరిశోధనలో నిగ్గుతేల్చే వాస్తవం ఒకటి బయటపడింది. పగటి పూట డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు పిల్లలను తీసుకువెళుతున్న ఒక ఆటోవాలాను బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా ఆ డ్రైవర్ రక్తంలో మద్యం శాతం ఏకంగా 250 ఎం.ఎల్‌గా నమోదవ్వడంతో ఖాకీలు ఖంగుతిన్నారు. ఇంత పెద్ద మోతాదులో మద్యం శాతం నమోదైందంటే అతను పీకల దాకా తాగాడని అర్థమైంది.
అతడు ఆటోను పూర్తిగా నియంత్రించలేని స్థితిలో ఉండటంతో పోలీసులు పిల్లలను వేరే ఆటోలో ఇంటికి పంపించారు. గత రెండు నెలలుగా పోలీసులు పిల్లలను పాఠశాలలకు తీసుకువెళుతున్న ఆటోలను పరిశీలిస్తే పదుల సంఖ్యలో ఆటోవాలాలు మత్తులో పట్టుబడ్డారు. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఏ ప్రమాదమూ జరగలేదు. వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు నగరంలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.


