టేక్ డైవర్షన్ ప్లీజ్!

 

మన రాజకీయ పార్టీలు ఎప్పుడయినా వివాదాలలో లేదా ఇబ్బందులలో చిక్కుకొన్నప్పుడు వెంటనే వేరే ఆసక్తికరమయిన అంశం ఏదో అందుకొని మాట్లాడుతూ ప్రజల, ప్రత్యర్ధుల మీడియా దృష్టిని మళ్ళిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ట్రిక్కుని అనేక ఏళ్లుగా చాలా విజయవంతంగా అమలుచేస్తూ అనేక సార్లు గండం గట్టెకింది. ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు, లోక్ పాల్ బిల్లుని, ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ అవినీతిపై పోరాటాన్నిదొరకపుచ్చుకొని సమస్యలనుండి బయటపడ్డారు. అయితే రాహుల్ గాంధీ పొరపాటున తమ కొంపముంచే ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణాన్ని కెలుక్కోవడంతో, ఇప్పుడు ఆ సమస్య నుండి బయటపడేందుకు అర్జెంటుగా మళ్ళీ మరో కొత్త అంశం కోసం కాంగ్రెస్ వెదుకులాడుతోంది.

 

ఇక, మొన్న శాసనసభ సమావేశాలు మొదలయ్యినప్పుడు తెదేపా నేతలు రెండుగా చీలిపోయి మీడియా ముందు, సభలో చాల జోరుగా వాదించేయడంతో తెరాసకు అడ్డుగా దొరికిపోయారు. అప్పుడు తెరాస నేతలు తమపై దాడి మొదలుపెట్టేసరికి తెదేపా నేతలు ఆత్మరక్షణలో పడ్డారు కానీ వెంటనే తేరుకొని వారు కూడా ఆ ‘ట్రిక్కు’ని మరోమారు విజయవంతంగా ప్రయోగించి బయటపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తెరాసను విలీనం చేయనందునే తెలంగాణా ఆలస్యమయిపోతోందని వారు లొల్లి చేయడంతో అందరి దృష్టీ తెదేపాపై నుండి తెరాసపైకి మళ్ళింది. ఇదేసమయంలో తెదేపా నేతలకు వీ.హనుమంత రావు వంటివారు కూడా కోరస్ పాడటం మొదలు పెట్టడంతో ఈసారి తెరాస ఆత్మరక్షణలో పడింది.

 

ఇటువంటి టీ కప్పులో తుఫానులను అనేకం చూసిన కేసీఆర్ వెంటనే రంగంలోకి దూకి, రాష్ట్ర విభజన బిల్లులో అత్యవసరంగా చేయవలసిన సవరణల గురించి చర్చ మొదలుపెట్టి, అవసరమయితే మళ్ళీ ఉద్యమానికయినా సిద్దమని ప్రకటించేయడంతో మ్యాటర్ ఆటోమేటిగ్గా దానికి డైవర్ట్ అయిపోయింది. ఆ తరువాత ఆయన టీ-కాంగ్రెస్ నేతలను, రాష్ట్రపతిని కలవడం వంటివి చేయడంతో ‘విలీనం’ పాయింటుని మరి వినపడకుండాపోయింది. ఒకవేళ మళ్ళీ వినబడినా దానికి కౌంటర్ గా టీ-బిల్లు- సవరణలు అనే టాపిక్ ఉంది గనుక పెద్దగా ఇబ్బంది ఉండదు.

 

ఇక అందరి గురించి చెప్పుకొని వైకాపాను వదిలేస్తే వాళ్ళు చాలా బాధపడతారు. గనుక వాళ్ళ గురించి కూడా ఓ నాలుగు ముక్కలు చెప్పుకోవలసిందే. దిగ్వజయ్ సింగ్ ‘జగన్ నా కొడుకువంటి వాడు’ అని కలవరించినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీతో తమకు ఎటువంటి అక్రమ సంబంధం లేదని రుజువు చేసేందుకు జగన్ సోనియాగాంధీని విమర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక సమైక్య ముసుగులో విభజనవాదం చేస్తున్నారని ఆరోపణలు వచ్చినప్పుడల్లా జగన్ అఫిడవిట్స్ గురించి మాట్లాడటం వీలయితే ఓసారి రాష్ట్రపతిని కలిసి రావడం కూడా ఆనవాయితీయే.

 

ఈ రాజకీయ గందరగోళం చూసి జనాలు వెంటనే ఏ సినిమా న్యూస్ కో షిఫ్ట్ అయిపోయి దాని గురించే ఆలోచించడం, మాట్లాడటం మొదలుపెడతారు.ఇలా డైవర్షన్ సాగుతూనే ఉంటుంది.