అణిగిమణిగి వుండాలంటూ... మణిపూర్‌లో తెలుగు విద్యార్థులపై దాడి
Published on: Sun Sep 14, 2014 1:36PM

ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య స్థానిక, స్థానికేతర వివాదం నడుస్తుంటే, అక్కడ మణిపూర్‌లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల మీద అక్కడి విద్యార్థులు మీరు స్థానికేతరులు అంటూ దాడులు చేశారు. మణిపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో 30 మంది తెలుగు విద్యార్థులపై లోకల్ స్టూడెంట్స్ దాడి చేశారు. స్థానికేతరులంటూ ఈ దాడిలో 8 మంది తెలుగు విద్యార్థులు గాయపడ్డారు. 20 రోజుల క్రితం విద్యార్థుల మధ్య మొదలైన గొడవలు ఇప్పుడు భౌతిక దాడులకు వరకు వచ్చాయి. తమకు అణిగిమణిగి వుంటేనే ఇక్కడ ఉండాలని మణిపూర్ స్థానిక విద్యార్థులు తెలుగు విద్యార్థులకు హుకుం జారీ చేయడంతో తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ పిల్లల భద్రతపై విద్యార్థులు తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి.


