TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళల వ్యక్తిత్వంపై దాడి.. చంద్రబాబు ఫైర్

Published on: Mon Jun 9, 2025 9:55AM

రాజకీయం, మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వారి వ్యక్తిత్వంపై దెబ్బ తీసే వారిని ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మీడియా డిబేట్ అంటూ ఓ  చానల్ లో రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆడబిడ్డలను గౌరవించడం మన సంప్రదాయం. మన భారతీయ జీవన విధానం, మరీ ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని చంద్రబాబు పేర్కొన్నారు. వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదన్నారు.  తన సొంత మీడియా చానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం దారుణమన్నారు.

రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరచిన  వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత విధ్వంస ప్రభుత్వం పై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశపూర్వకంగా, నీచాతినీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్నే అవమానించడమన్నారు.  మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.