ఈ అరాచకం గురించి ఆ నేతలు ఏమంటారో ?

 

ఆమెని మానభంగం చేశారు ,
ఆమె తండ్రిని జైలులో పెట్టి లాకప్ డెత్ చేశారని ఆరోపణ,
ఆమె పిన్నిని, అత్తని దుండగులే నిర్దాక్షిణ్యంగా చంపేశారు ,
ప్రస్తుతానికి ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నది, బతుకుతుందో లేదో కూడా తెలీదు.
 

ఆమె కోసం ముందుకు వచ్చిన రక్తసంబంధీకులందరిని వేధిస్తున్నారు, వాళ్ళ ఉనికే లేకుండా చేయటానికి ప్రయత్నిస్తున్నారు, ఇదంతా ఏదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా? కాదు మన దేశంలో ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న సజీవ మారణ కాండ. ఉత్తరప్రదేశ్‌ లోని ఒక బీజేపీ ఎమ్మెల్యే ఓ అత్యాచార, హత్యాయత్నం కేసులో నిందితుడు. తనపై ఫిర్యాదు చేసిన బాధితురాలిని, ఆమె తరపు వాదిస్తున్న న్యాయవాదిని, సాక్ష్యులను తెలుగు సినిమా తరహాలో అంతం చేయటానికి స్కెచ్ వేశాడు. 

అత్యాచార ఘటనకు సంబంధించి కుల్‌దీప్‌ సెంగార్‌ గత ఏడాది ఏప్రిల్‌ 13 నుంచి జైలులో ఉన్నారు. జైలు నుంచే ఆయన రేప్‌ బాధితురాలిని కారు ప్రమాదంలో కడతేర్చడానికి కుట్ర పన్నారన్నది తాజాగా వస్తున్న ఆరోపణ. తాజా కేసులో ఆయననే మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. బాధితురాలు, ఆమె తల్లి, ఇద్దరు మేనత్తలు, వారి లాయరు అంతా కలిసి ఆదివారం నాడు ఫతేపూర్‌ నుంచి ఓ కారులో వెళ్తుండగా రాయ్‌బరేలీ శివార్ల లో ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. 

ఆ ధాటికి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అందులో ఒకామె నాటి అత్యాచార ఘటనకు ప్రత్యక్ష సాక్షి. లాయర్‌కు, బాధితురాలికి తీవ్రగాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నారు. కాస్త తక్కువగా గాయపడినది బాధితురాలి తల్లి మాత్రమే! లారీ నెంబరు కనపడకుండా నల్లటి పెయింటు వేసి చెరిపేయడం, దాని డ్రైవింగ్‌ పత్రాలు నకిలీవి కావడంతో ఈ ప్రమాదంపై అనుమానాలు నెలకొన్నాయి. 

ఇది తన కుటుంబాన్ని కడతేర్చడానికి ఉన్నావ్‌ ఎమ్మెల్యే చేసిన కుట్ర అని బాధితురాలి తల్లి ఆరోపించారు. కాగా, 13 ఏళ్ల అమ్మాయిపై దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను, ఆమె కుటుంబాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి బీజేపీ ఎమ్మెల్యే ప్రయత్నించారని లోక్‌సభలో ఎస్పీ సభ్యుడు గోపాల్‌ యాదవ్‌ ఆరోపించారు. ఘటనపై నిష్పాక్షిక సీబీఐ దర్యాప్తు జరపాలని విపక్షాలు కోరాయి. విపక్షాల ఒత్తిడికి బీజేపీ ప్రభుత్వం తలొగ్గింది. 

ఉన్నావ్‌ రేప్‌ బాధితురాలి రోడ్డు ప్రమాదం కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్‌పై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. ఎమ్మెల్యే మనుషులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు పెరిగాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణను జరిపించాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవటానికి ముందు ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలు ఈ కేసును సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

దీనికి తగ్గట్లే తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ కేసులో ఆమె ఓడిపోతే ఓడిపోయేది ఆమె మాత్రమే కాదు మనం గొప్పగా చెప్పుకునే ప్రజాస్వామ్యం - హక్కులు -స్వేచ్ఛ -చట్టాలు -న్యాయం కూడా !. అసలు ఇంత జరిగినా కనీసం ఆ ఎమ్మెల్యే భాజపా సభ్యత్వం కూడా అలానే ఉంది, మరి ప్రతి విషయంలో నీతి వాక్యాలు చెప్పే బీజేపీ నేతలు ఈ విషయం మీద ఏమంటారో ?