పోలీసులు, టీచర్లపై రాళ్ల దాడి.. రెచ్చిపోయిన వైసీపీ వర్గీయులు..
Published on: Wed Oct 6, 2021 2:06PM
అది చదువులు చెప్పే విద్యాలయం. ఆ ప్రాంగణంలో చదువులు నేర్చే పిల్లలు ఉంటారు.. చదువు చెప్పే ఉపాధ్యాయులు ఉంటారు. కానీ, రాజకీయ మూకల రంగప్రవేశంతో అక్కడంతా రణరంగంగా మారింది. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో.. పరస్పర దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏకంగా పోలీసులు, టీచర్లపైనే దాడులకు తెగబడ్డారు ఓ వర్గీయులు.
తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు, ఉపాధ్యాయులపై ఓ వర్గీయులు రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో ఓ మహిళా ఉద్యోగి, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.
గత నెల 22న జరిగిన విద్యాకమిటీ ఎన్నికలోనూ ఇలానే ఘర్షనలు తలెత్తాయి. దాంతో ఎన్నికను వాయిదా వేశారు. మరోసారి విద్యాకమిటీ ఎలక్షన్‌కు ప్రయత్నించగా మళ్లీ గొడవ చెలరేగింది. రాళ్ల దాడికి దారి తీసింది. ఉద్రికత్తల నేపథ్యంలో తిరుమాలి గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి ఇంకా నివురు గప్పిన నిప్పులానే ఉంది.


