జడ్జి రామకృష్ణ సోదరుడిపై హత్యాయత్నం.. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ

చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై కొందరు దుండగులు ఆదివారం దాడి చేశారు. ఈ ఘటనలో రామచంద్ర తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది వైసీపీ వాళ్లేనంటూ టీడీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు, ఈ ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. 

 

కొత్తకోటలో రామచంద్ర సరుకులు కొంటుండగా దుండగులు హత్యాయత్నం చేశారు. సూరపవారిపల్లెకు చెందిన కుమార్‌, ఆయన అనుచరులు కలసి తనపై దాడిచేసినట్లు రామచంద్ర తెలిపారు. కొత్తకోట బస్టాండులో పండ్లు కొనుగోలు చేస్తుండగా కర్ణాటక రిజిస్ర్టేషన్‌ కలిగిన కారులో వచ్చిన వారు తనపై దాడిచేశారన్నారు. కాగా, తీవ్రంగా గాయపడిన రామచంద్రను స్థానికులు చికిత్స నిమిత్తం బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా వైద్యశాలకు పంపారు.

 

మదనపల్లెలో చికిత్స పొందుతున్న రామచంద్రను టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పరామర్శించారు.ఈ సందర్భంగా పార్టీ అగ్రనేత కళా వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూరిత దాడులకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని మండిపడ్డారు. గత 16 నెలల కాలంలో 152కి పైగా దాడులు జరిగాయని ఆరోపించారు. జడ్జి కుటుంబ సభ్యులనే వేధిస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని కళా వెంకట్రావు ప్రశ్నించారు.

 

కాగా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులకు, తమ కుటుంబానికి మధ్య ఇటీవల జరుగుతున్న భూవివాదాలే ఈ దాడికి కారణమని జడ్జి రామకృష్ణ ఆరోపించారు. స్థానిక వైసీపీ నాయకులు తన తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు.

 

గతంలో జడ్జి రామకృష్ణను రోడ్డుపైకి రాకుండా తహసీల్దార్‌ నిషేధాజ్ఞలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఫిర్యాదు ఆధారంగా జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రను బి.కొత్తకోట పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల ప్రకారమే తనను అధికార పార్టీ నేతలు, అధికారులు అనేక రకాలుగా హింసిస్తున్నారని ఆయన అప్పుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుండగా కావాలనే ఈ కేసులో మహిళలను రప్పించి అక్రమంగా కేసులు బనాయించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని జడ్జి రామకృష్ణ ఆరోపించారు. 

 

ఇప్పుడు ఏకంగా జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. అధికార పార్టీ తప్పుల్ని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టడం, హత్యాయత్నం చేయడం వంటివి చేస్తారా అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.