ఈటలపై కోడి కత్తి తరహా దాడి?.. హుజురాబాద్‌లో సంచలనం..
Published on: Sat Oct 2, 2021 5:37PM
హుజురాబాద్ ఉప పోరు హోరెత్తుతోంది. ఈటల రాజేందర్ చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. కాలికి బలపం కట్టుకొని మరీ నియోజకవర్గమంతా తిరుగుతున్నారు. సరైన తిండి లేదు.. వేళకు నిద్ర లేదు.. మూడు నెలలుగా ఇదే తీరు. ఇక బైపోల్ డేట్ ఫిక్స్ కావడంతో.. హుజురా..వార్ మరింత ముదిరింది. ఈ దశలో సంచలన విషయాలు తెర మీదకు వస్తుండటం ఆందోళనకరంగా మారింది.
ఈటల, టీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో లడాయి జరుగుతోంది. ఈటలను ఓడించేందుకు అధికార పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. తాజాగా, హుజురాబాద్‌లో ఓ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటల రాజేందర్‌పై దాడి జరుగబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఎవరు ఈ వార్తను లీక్ చేశారో.. ఈటలపై ఎవరు దాడి చేస్తారో.. ఎందుకు దాడి చేస్తారో.. ఎలా దాడి చేస్తారో.. తెలీదు కానీ.. ఈటలపై అటాక్ కానుందంటూ ప్రచారం మాత్రం జరిగిపోతోంది. దాడి జరిగే డేట్స్ కూడా చెప్పేస్తున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఈటలపై అటాక్ జరుగుతుందట. డేట్స్‌తో సహా చెబుతున్నారంటే ఏమనుకోవాలి? హుజురాబాద్‌లో ఈటల టార్గెట్‌గా మరో కోడి కత్తి దాడి జరుగుతుందా? అనే అనుమానం. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే.. కోడి కత్తి దాడి తరహాలోనే రాజకీయంగా లాభపడటానికి ఈటలనే.. తనపై తాను ఈ దాడి చేయించుకోబోతున్నారంటూ ప్రచారం అవుతుండటం హుజురాబాద్ నియోజకవర్గంలో కలకలం రేపుతోంది.
ఈ ప్రచారంపై ఈటల రాజేందర్ మండిపడుతున్నారు. కావాలనే తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 13, 14 తేదీలలో తన మీదన తానే దాడి చేయించుకుంటున్నా.. అంటూ మంత్రులు అంటున్నారని.. దీని వెనుక ఏదో మతలబు ఉండే ఉంటుందని అనుమానిస్తున్నారు. తన మీద దాడికి అధికార పార్టీ నేతలు ఏదైనా కుట్ర చేస్తున్నారేమో అని.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


