కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు దీప్కే పై దాడి
Published on: Tue Jun 16, 2026 11:30AM

భారతీయ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ, సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో దూసుకుపోతున్న జెన్ జీ వ్యంగ్య రాజకీయ పక్షం కాక్రోచ్ జనతా పార్టీ చుట్టూ ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీక్ ఉదంతంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన నిరసన వేళ.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అభిజిత్ దీప్కే పై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు.
ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, విద్యార్థి లోకం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకే పరిమితం కాకుండా.. రోడ్లపైకి వచ్చి ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న ఈ పొలిటికల్ గ్రూప్‌పై ఈ తరహా భౌతిక దాడులు జరగడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన జైపూర్ పోలీసులు ఈ దాడి ఉదంతంపై కేసు నమోదు చేసి, వీడియో ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇలా కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం కేవలం ఉత్తర భారత్‌కే పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాలు, కర్నాటకలో సైతం కాక్రోచ్ జనతాపార్టీకి విశేష ఆదరణ లభిస్తోంది. బెంగళూరులో కాక్రోచ్ జనతాపార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొని కాక్రోచ్ జనతా పార్టీకి తన పూర్తి మద్దతు ప్రకటించారు. నీట్ వివాదంలో పారదర్శకత, బాధ్యతారాహిత్యంపై ఆయన గళమెత్తారు.


