ఏపీలో అణు విద్యుత్ కేంద్రం.. కేంద్రం ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అణు విద్యుత్ కేంద్ర ఏర్పాటుకు సంబంధించి రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు బదులుగా పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టతను ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ వద్ద ఈ ప్లాంటును నిర్మించబోతున్నామని.. దీనికోసం అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు గా కేంద్రం పేర్కొంది. 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ప్లాంటులో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి కావలసిన అన్ని రకాల అధ్యయనాల తర్వాతనే కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు కేంద్రం చెప్పింది.

 

కాగా, అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఇప్పటికే 2,700 ఎకరాలను సేకరించారు. మొత్తంగా 61 వేల కోట్ల అంచనాలతో ప్రతిపాదనలను రూపొందించారు. ఈ సంవత్సరం శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సంవత్సరం శంకుస్థాపన జరిగితే వచ్చే ఐదేళ్లలో అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయ్యే అవకాశాలున్నాయి.