ఆత్మకూరు ఉప ఎన్నిక..వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి.. బీఫామ్ ఇచ్చిన జగన్
Published on: Wed Jun 1, 2022 9:37PM
ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌రెడ్డి ఖరారయ్యారు. బుధవారం విక్రమ్ రెడ్డి జగన్‌ను కలిశారు. ఆ సందర్భంగా జగన్ విక్రమ్‌రెడ్డికి బీ-ఫామ్ ఇచ్చారు.
మాజీమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన సంగతి విదితమే. తొలుత గౌతమ్‌రెడ్డి సతీమణికే ఆత్మకూరు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తన రెండో కుమారుడు విక్రమ్‌రెడ్డికి ఆత్మకూరు టికెట్ ఇవ్వాలని కోరడంతో జగన్ సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా ఆత్మకూరు ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వైసీపీ మేకపాటి కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడంతో తెలుగుదేశం పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
అయితే బీజేపీ మాత్రం పోటీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ మేరకు ప్రకటించారు. గతంలో గద్వేలు ఉప ఎన్నికలోనూ తెలుగుదేశం పోటీకి దూరంగా ఉండగా బీజేపీ అభ్యర్థిని రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే.


