TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విత్‌డ్రాపై నో లిమిట్స్.. కాని "డబ్బుల్లేవ్"

Published on: Mon Mar 13, 2017 6:47PM

దేశంలో పేరుకుపోతున్న నల్లధనానికి అడ్డుకట్ట వేయడంతో పాటు నకిలీ నోట్ల చలామణికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ గతేడాది నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేశారు. ప్రజలు తమ దగ్గర ఉన్న పాతనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి డిసెంబర్ 31 వరకు గడువు విధించారు. ఆ తర్వాత షరతులతో మార్చి 31 వరకు అనుమతించారు. అయితే పెద్ద నోట్లు రద్దుకావడంతో దేశంలో నగదు సంక్షోభం ఏర్పడింది. విత్‌ డ్రాపై ఆంక్షలు విధించడంతో అత్యవసరాల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. డబ్బు కోసం పనులు మానుకుని బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. అయితే ఆర్‌బీఐ రంగంలోకి దిగి విడతల వారీగా నగదు ఉపసంహరణను అనుమతించింది.

 

మెల్ల మెల్లగా పరిమితులు సడలిస్తూ వచ్చింది..కష్టాలు తీరుతున్నాయి అనుకుంటున్న సమయంలో మళ్లీ పెద్దనోట్ల రద్దు నాటి పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో తలెత్తాయి. మార్చి 1 నుంచి ఏటీఎంలు అలాగే బ్యాంకుల్లో కూడా నగదు నిల్వలు తగ్గడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు మళ్లీ మొదటికొచ్చాయి..బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గి, విత్‌డ్రాలు పెరగడంతో ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

 

 

ఫలానా చోట డబ్బు ఉంది అంటే చాలు జనం ఆ పక్కకు పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడికి ఎలాగో చేరుకునే సరికి అక్కడ కూడా నో క్యాష్ బోర్డు సామాన్యుడిని వెక్కిరిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజుతో నగదు ఉపసంహరణపై ఉన్న అన్నీ పరిమితులు తొలగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అయితే సరిపడనంత నగదు లభ్యత లేకపోవడంతో పాటు బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే దేశంలో కొన్ని ప్రాంతాల్లో నగదు లభ్యతలో ఇబ్బందులు ఉన్నాయని వీలైనంత త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆర్‌బీఐ అధికారులు తెలిపారు.